Begin typing your search above and press return to search.

ఆ విషయంలో దొందూ దొందే!

By:  Tupaki Desk   |   10 Oct 2017 11:34 AM GMT
ఆ విషయంలో దొందూ దొందే!
X
ఏ విషయంలో ఎలాగైనా ఉండొచ్చు గానీ.. ఒక్క విషయంలో మాత్రం తెలంగాణ - ఏపీ ప్రభుత్వాలు రెండూ దొందూ దొందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. మొండితనం విషయంలో.. ఎదుటివారి మీద నిందలు వేయడమే తప్ప.. తాము సక్రమంగా వ్యవహరిస్తున్నామా లేదా చెక్ చేసుకోకపోవడంలో.. ఇద్దరిదీ ఒకే రకమైన వైఖరిగా ఉంది. గోదావరి జలాల విషయంలో నదికి ఎగువన దిగువన తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ తనకు తోచిన ప్రాజెక్టులు కట్టుకుంటున్నది. అటు ఆంధ్రప్రదేశ్ పోలవరం ఒక్కటి పూర్తయితే చాలు.. యావత్ గోదావరి ప్రవాహం నిలకడగా తమ చెంతే ఉంటుందని అనుకుంటోంది. ఆ నది విషయంలో వీరిద్దరికీ ఎలాంటి తగాదాలు రావడం లేదు. నదికి అటూ-ఇటూ రెండు రాష్ట్రాలూ ఉండి రెండు వైపులా ఉన్న కాలువల ద్వారా నీటిని తమ తమ రాష్ట్రాలకు తీసుకోవడానికి వెసులుబాటు ఉన్న కృష్ణా నదీ జలాల విషయంలోనే అడ్డూ అదుపూలేని రీతిలో చికాకులు చుట్టుముడుతున్నాయి. రెండు రాష్ట్రాలూ పరస్పరం అనేకానేక ఆరోపణలు చేసుకుంటున్నాయి.

ఈ నదీ జలాల పంపకం విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించకపోతుండడంతో.. మధ్యలో రాజీ చేసే పెద్దరికం పాత్ర పోషించాల్సిన కృష్ణా జలాల బోర్డు కూడా చేతులెత్తేసింది. ఈ రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు ఈ రెండు ప్రభుత్వాలు - అధికారులే కూర్చుని తేల్చుకోవాలని తమకు సంబంధం లేదని వారు తీవ్రంగా వ్యాఖ్యానించడం విశేషం.

పరిస్థితి ఇంత దాకా రావడానికి సరైన కారణాలే ఉన్నాయి. కృష్ణా జలాలు అదనంగా వాడేసుకునేలా తెలంగాణ ఎత్తిపోతల ప్రాజెక్టులు కట్టేస్తున్నదంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పలు ఫిర్యాదులు చేసింది. దాంతో తెలంగాణ ఆ పనులు ఆపాల్సి వచ్చింది. ఇవన్నీ ఇదివరలో అనుమతులు పొందినవే అని వారు వాదించినా ప్రయోజనం దక్కలేదు. అదే సమయంలో నీటిని పొందడంలో కేటాయించిన వాటాలకు మించి.. ఏపీ సర్కారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా వాడేసుకుంటున్నదని తెలంగాణ అనేక ఫిర్యాదులు చేస్తున్నది.

ఈ మధ్యలో ఇరు రాష్ట్రాలు తమకు ఇంతింత వాటా కావాలంటూ కృష్ణా నదీజలాల బోర్డుకు వినతులు పంపుకున్నాయి. దీనిమీద అభ్యంతరాలు ఉంటే చెప్పాలని ఒకరి వినతిని మరొక రాష్ట్రానికి బోర్డు పంపింది. అయితే ఈ విషయంలో ఇరు రాష్ట్రాల అధికారులూ స్పందించలేదు. అవును లేదా కుదర్దు అని కూడా చెప్పలేదు. రెండు ప్రభుత్వాలూ దొందూ అన్నట్లే వ్యవహరించాయి. పలుమార్లు గుర్తు చేసినా స్పందన లేకపోవడంతో.. వీరి మధ్య పంపకాలు తమ వల్ల కాదని, ఆ రాష్ట్రాల స్థాయిలోనే కూర్చుని తేల్చుకోవాలని చెప్పేసి కృష్ణా బోర్డు చేతులు దులుపుకున్నట్లుగా కనిపిస్తోంది.