Begin typing your search above and press return to search.

ఆ సీమసింహం ఉద్యమం చేస్తానంటోంది..

By:  Tupaki Desk   |   14 Aug 2016 8:45 AM GMT
ఆ సీమసింహం ఉద్యమం చేస్తానంటోంది..
X
మొన్నమొన్నటి వరకు ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఉద్యమంతో నానా ఇబ్బందులు పడిన ఏపీ సీఎం చంద్రబాబుకు మరో ఉద్యమ తలనొప్పి మొదలయ్యే సూచనలు కనపిస్తున్నాయి. రాయలసీమకు చెందిన ప్రముఖ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తానని చెబుతున్నారు. చంద్రబాబుపై మండిపడుతున్న ఆయన ముఖ్యమంత్రి రాయలసీమ ద్రోహిగా మారారని విమర్శించారు. రాయలసీమకు నీరు అందకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

శ్రీశైలం డ్యాంలో 854అడుగుల నీటిమట్టం ఉంటేనే రాయలసీమకు నీరు అందుతాయని, కానీ ఆ పరిస్థితి లేకుండా చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తీరు వల్ల రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయని కోట్ల ఆవేదన చెందారు. రాయలసీమ నీటి హక్కులను కాపాడుకునేందుకు త్వరలోనే ఉద్యమం ప్రారంభిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇందు కోసం త్వరలోనే రాయలసీమ, నెల్లూరు - ప్రకాశం జిల్లా నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రెండేళ్ల కాలంలో టీడీపీ పెద్దలు దోచుకోవడానికే పరిమితమయ్యారని కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి ఆరోపించారు.

కాగా కోట్లను ఆగ్రహానికి మారుపేరుగా చెబుతారు. స్వతాహాగా ముక్కుసూటి మనిషైన కోట్ల గతంలో సొంత పార్టీ కాంగ్రెస్ అధిష్ఠానంపైనా ఆగ్రహించగా పార్టీ పెద్దలు ఆయన్ను బుజ్జగించారు. ఆయన్ను బుజ్జగించడం కూడా అంత తేలికకాదని అప్పట్లో కాంగ్రెస్ నేతలకే బాగా అర్థమైంది. అలాంటి కోట్ల ఇప్పుడు రాయలసీమ కోసం ఉద్యమం చేస్తే దాని తీవ్రత ఎక్కువగారు ఉంటుందని భావిస్తున్నారు. కోట్ల ఉద్యమం మొదలైతే చంద్రబాబుకు అది ఇబ్బందికరంగా పరిణమించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.