Begin typing your search above and press return to search.

ఆ ముఖ్య‌మంత్రి త‌న‌యుడు ఆలూరు నుంచి పోటీ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   10 Aug 2022 11:30 AM GMT
ఆ ముఖ్య‌మంత్రి త‌న‌యుడు ఆలూరు నుంచి పోటీ చేస్తున్నారా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని క‌ర్నూలు జిల్లాలో రాజ‌కీయంగా ప‌ట్టు ఉన్న కుటుంబాల్లో కోట్ల కుటుంబం ఒక‌టి. కోట్ల విజ‌య‌భాస్క‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ఇలా ఎన్నో ప‌ద‌వులు చేప‌ట్టారు. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం విజ‌య‌భాస్క‌ర‌రెడ్డి త‌న‌యుడు కోట్ల సూర్య‌ప్ర‌కాష్ రెడ్డి కూడా ప‌లుమార్లు క‌ర్నూలు నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ప‌నిచేశారు. అయితే 2014, 2019 ఎన్నిక‌ల్లో కర్నూలు ఎంపీగా పోటీ చేసి కోట్ల ఓడిపోయారు. 2014, 2019 ఎన్నిక‌ల్లో క‌ర్నూలు నుంచి వైఎస్సార్సీపీ అభ్య‌ర్థులు గెలుపొందిన సంగ‌తి తెలిసిందే.

2019 ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు కోట్ల కుటుంబం కాంగ్రెస్ పార్టీకి క‌ర‌డు గ‌ట్టిన అభిమానులుగా ఉన్నారు. అయితే 2014లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో నామ‌రూపాల్లేకుండా కొట్టుకుపోయింది. అయినా స‌రే కోట్ల కుటుంబం కాంగ్రెస్ లోనే ఉంది.

కాంగ్రెస్ పై ఆగ్ర‌హ జ్వాల‌లు వీచిన 2014 ఎన్నిక‌ల్లోనూ కోట్ల సూర్య‌ప్ర‌కాష్ రెడ్డి క‌ర్నూలు ఎంపీగా పోటీ చేసి ల‌క్ష‌కు పైగా ఓట్లు తెచ్చుకున్నారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ లో భ‌విష్య‌త్తు లేక‌పోవ‌డంతో ఆ పార్టీకి రాజీనామా చేసి 2019 ఎన్నిక‌ల ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

2019లో క‌ర్నూలు నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేసి కోట్ల సూర్య‌ప్ర‌కాష్ రెడ్డి ఓడిపోయారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న అసెంబ్లీకి పోటీ చేసే ఉద్దేశంతో ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. క‌ర్నూలు జిల్లాలోని ఆలూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఆలూరు నుంచి వైఎస్సార్సీపీకి చెందిన గుమ్మ‌నూరు జ‌య‌రాం ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతేకాకుండా జ‌గ‌న్ కేబినెట్ లో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు.

మ‌రోవైపు కోట్ల సూర్య‌ప్ర‌కాష్ రెడ్ఢి స‌తీమ‌ణి కోట్ల సుజాతమ్మ కూడా గ‌తంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి ఆమె క‌ర్నూలు జిల్లా డోన్ నుంచి పోటీకి సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం.

ప్ర‌స్తుతం డోన్ నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ ఉన్నారు. క‌ర్నూలు జిల్లాల్లో వైఎస్సార్సీపీని ఓడించాలంటే బ‌ల‌మైన రెడ్డి అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దించాల‌ని టీడీపీ భావిస్తోంద‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో కోట్ల కుటుంబానికి అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తోంద‌ని అంటున్నారు.