Begin typing your search above and press return to search.

ఆ మాజీ కేంద్ర‌మంత్రి పార్టీ మార‌ట్లేద‌ట‌

By:  Tupaki Desk   |   13 Dec 2016 4:33 AM GMT
ఆ మాజీ కేంద్ర‌మంత్రి పార్టీ మార‌ట్లేద‌ట‌
X
కొద్దికాలంగా పార్టీ మారుతున్న ప్ర‌ముఖు నాయ‌కుల్లో కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి పేరు ఒక‌టి. కోట్ల స‌మ‌కాలికులు ఇప్ప‌టికే టీడీపీ - బీజేపీలో చేర‌డం - ఇటీవ‌ల సూర్య‌ప్ర‌కాష్ రెడ్డి అత్యంత స‌న్నిహితుడు సైతం అధికార టీడీపీ కండువా క‌ప్పుకొన్న నేప‌థ్యంలో ఈ ప్ర‌చారం జోరుగా సాగింది. అయితే ఈ విష‌యంపై కోట్ల క్లారిటీ ఇచ్చారు. కర్నూలు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో కోట్ల మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నానని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని కోట్ల జ‌య‌సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అలాంటి ప్ర‌చారాల‌ను నమ్మవద్దని - చివరి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పదవులు శాశ్వతం కాదు - ప్రజాభిమానమే ముఖ్యమని కోట్ల‌ వెల్లడించారు. కోట్ల విజ‌య‌భాస్క‌ర రెడ్డి కుటుంబాన్ని న‌మ్ముకున్న‌ అనుచరులు - కార్యకర్తలు - అభిమానులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు.

కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలకు కౌంట్‌ డౌన్ మొదలైందని, ఎక్కువ కాలం ప్రజలు ఓపికతో ఉండలేరని ఖచ్చితంగా తగిన బుద్ధి చెబుతారని కోట్ల జ‌య‌సూర్య ప్ర‌కాశ్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొందరపాటు నిర్ణయం వల్ల దేశ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్రకటించిన న‌వంబ‌రు 8న దేశానికి ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌ట‌కీ...ప్రధాని మోడీ ముందుగానే నల్ల కుబేరులకు సమాచారం ఇచ్చారని కోట్ల ఆరోపించారు. దీంతో నల్లకుబేరులు దర్జాగా తిరుగుతూ అక్రమ మార్గాల్లో నల్లడబ్బును ఇప్పటికే సర్దుకున్నారని, సామాన్యులు మాత్రం అష్టకష్టాలు పడుతున్నారని కోట్ల జ‌య‌సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద నోట్లను రద్దు చేయటం వల్ల ఎన్నో వివాహాలు నిలిచిపోగా, వృద్ధులు - రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ప్రజలు బ్యాంకుల నుంచి తమ డబ్బును తీసుకోవటానికి కూడా ఆంక్షలు విధించిన మోడీ బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ - క‌ర్ణాట‌క‌కు చెందిన మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి కుటుంబాల వివాహాలకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/