Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు చంద్రబాబు ప్యాకేజీ ఇస్తున్నాడా

By:  Tupaki Desk   |   8 Sep 2016 5:56 AM GMT
కేసీఆర్‌ కు చంద్రబాబు ప్యాకేజీ ఇస్తున్నాడా
X
రాజకీయ నాయకులు తమ మాటలతో మభ్య పెట్టడం - కొన్ని తాయిలాలతో ప్యాకేజీలతో జనాన్ని బుట్టలో పడేసి పబ్బం గడుపుకోవడం చాలా మామూలు సంగతి. అవసరాన్ని బట్టి కొందరు నాయకులకు కూడా ఇలాంటి ప్యాకేజీలు ఇచ్చి ఆయా అవసరాలకు తగ్గట్టుగా రోజులు నెట్టుకొస్తుంటారు. అయితే.. ఏకంగా సమానస్థాయిలో ఉండే మరో ముఖ్యమంత్రికి ఒక ముఖ్యమంత్రి ప్యాకేజీ తాయిలాలు అందించి.. తనకు ఫేవర్‌ గా వ్యవహరించాల్సిందిగా కోరడం జరుగుతుందా? ఏమో వైకాపా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర రెడ్డి మాటలను వింటున్నప్పుడు అలాంటి అనుమానమే కలుగుతోంది.

ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడిలా ఆరోపణలా ఎదుర్కొంటున్న చంద్రబాబునాయుడు.. తనను కేసునుంచి బయట పడేయడానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు ఏ ప్యాకేజీ ప్రకటించారంటూ వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి విమర్శిస్తున్నారు. ఒకప్పట్లో ఈ కేసు నుంచి చంద్రబాబునాయుడును భగవంతుడు కూడా కాపాడలేడని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించిన కేసీఆర్‌.. ఇప్పుడు కేసు విచారణ పట్ల ఎందుకు మౌనం వహిస్తున్నారని, సీబీఐ కోర్టు ఆదేశించిన తర్వాత కూడా.. ముఖ్యమంత్రి ఎందుకు దీనిపై శ్రద్ధ వహించడం లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ కేసు విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా అబద్ధాలే చెబుతున్నారంటూ కోటంరెడ్డి విమర్శలు గుప్పించడం విశేషం.

సాధారణంగా తెలంగాణ సీఎం మీద తీవ్రమైన విమర్శల జోలికి వెళ్లని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకులు ఈ కేసు విషయంలో కేసీఆర్‌ ను కూడా ఓ ఆటాడుకోవడం చిత్రంగానే కనిపిస్తోంది. ప్రజల్లో ఇలాంటి సందేహాలు వ్యాప్తి చెందుతున్నాయనే అభిప్రాయం తన ద్రుష్టికి వస్తే కేసీఆర్‌.. తనంత తానే.. కేసును చురుగ్గా విచారణ నడిపిస్తాడేమో అనేది బహుశా వారి ఆశ కావచ్చునని జనం అనుకుంటున్నారు.