Begin typing your search above and press return to search.

నోటి దూకుడు.. ఆ ఎమ్మెల్యేను ఒంట‌రిని చేసిందా...?

By:  Tupaki Desk   |   25 Sep 2021 1:30 AM GMT
నోటి దూకుడు.. ఆ ఎమ్మెల్యేను ఒంట‌రిని చేసిందా...?
X
ఆయ‌న నోరు విప్పితే.. ఫుల్ ఓ రేంజ్‌లో టీవీల‌కు రేటింగ్ ఉంటుంది. ఆయన అడుగు క‌దిపితే.. భారీ ఎత్తున అభిమాన గ‌ణం వెనుక వ‌స్తుంది. అయితే.. ఇవ‌న్నీ.. ఒక‌ప్పుడు.. ఇప్పుడు ఆయ‌నను ప‌ట్టించుకునే వారు.. ఆయ‌న వ‌స్తే హ‌డావుడి చేసేవారు కూడా క‌రువ‌య్యారు. దీనికి కార‌ణం.. ఆయ‌న నోటి దుర‌దే అంటు న్నారు ప‌రిశీల‌కులు. ఇంత‌కీ.. ఆయ‌న ఎవ‌రంటే.. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి. దూకు డుకు కేరాఫ్ గా ఉన్న ఈయ‌న‌.. వైసీపీ అధికారంలోకి రాక‌ముందు.. వ‌చ్చిన త‌ర్వాత కూడా చాన్నాళ్లు దూకుడుగానే ఉన్నారు.

అయితే.. కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు పార్టీలో ఒంటరిని చేశాయి. మంత్రి అనిల్‌కుమార్‌కు స్నేహితుడిగా ఉంటూ.. దూకుడుగా వ్య‌వ‌హ‌రించిన కోటంరెడ్డి.. కొన్నాళ్లుగా ఎవ‌రికీ క‌నిపించ‌డంలేదు. అంతేకాదు.. పార్టీపైనా..జ‌గ‌న్‌పైనా ఎవ‌రు ఏమ‌న్నా.. వెంట‌నే రియాక్ట్ అయ్యే.. కోటంరెడ్డి.. ఇప్పుడు టీడీపీ మాజీ మంత్రి అయ్య‌న్న వ్యాఖ్య‌ల త‌ర్వాత కూడా ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దీనికి కార‌ణం.. ఆయ‌న ఫుల్లుగా సైలెంట్ కావ‌డమే. దీనికి కార‌ణం.. రాష్ట్ర సర్కారుపై ఆయ‌న చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లే అంటున్నారు ప‌రిశీల‌కులు.

నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యేగా వ‌రుస‌గా రెండోసారి కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఎన్నిక‌య్యారు. యువ‌జ‌న కాంగ్రెస్‌లో యాక్టీవ్‌గా కొన‌సాగిన కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి... వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అభిమానిగా జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర‌య్యారు. వైసీపీ ఆవిర్భావం త‌ర్వాత ఆ పార్టీ నెల్లూరు రూర‌ల్ నాయ‌కుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలో 2014లో నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ వాయిస్‌ను వినిపించ‌డంలో ముందు వ‌రుస‌లో ఉంటూ వ‌చ్చారు. 2019లో పార్టీ అధికారంలోకి వ‌చ్చాక కూడా బాగానే మాట్లాడారు.

అయితే.. అనూహ్యంగా ఆయ‌న చేసిన కొన్ని వ్యాఖ్య‌లు.. ప్ర‌బుత్వాన్ని ఇర‌కాటంలోకి నెట్టాయి. జ‌గ‌న్ పాల‌న‌లో సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు త‌ప్ప , అభివృద్ధి లేద‌నే ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు బ‌లం చేకూర్చేలా కోటంరెడ్డి అన్న మాట‌లు అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధిపై స్థానికులు ఎమ్మెల్యే కోటంరెడ్డిని క‌ల‌వ‌గా.. ప‌నులు చేయ‌డానికి త‌న నిస్స‌హాయ‌త‌ను వ్య‌క్తం చేయ‌డ‌మే కాకుండా.. ఒక్క రూపాయి లేద‌ని, దీంతో తానేమీ చేయ‌లేనని ప్ర‌జ‌ల‌కు తేల్చి చెప్పారు. అంతేకాదు.. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు వ‌ల్ల అభివృద్ధి ప‌నుల‌కు నిధులు కేటాయించ‌లేని పరిస్థితి అని బ‌దులిచ్చారు.

ఈ వ్యాఖ్య‌లు .. పార్టీ అధిష్టానానికి చేరాయి. ప్ర‌భుత్వ విధానాల‌పై కోటంరెడ్డి నిర‌స‌న ప్ర‌క‌టించేందుకే... బ‌హిరంగంగా మాట్లాడార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. దీంతో ఆయ‌న‌పై అధిష్టానం అప్ప‌టి నుంచి గుర్రుగానే ఉంది. అదే స‌మ‌యంలో రాసుకుని పూసుకుని తిరిగిన మంత్రి అనిల్ కూడా శ్రీధ‌ర్‌రెడ్డిని అప్ప‌టి నుంచి ప‌క్క‌న పెడుతూ వ‌చ్చారు. దీంతో విష‌యాన్ని గ్ర‌హించిన కోటంరెడ్డి మౌనం పాటిస్తున్నారు. దీనికి తోడు ఆయ‌న‌కు స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డికి కూడా తీవ్ర‌మైన విబేధాలు ఉన్నాయి. ఇక ఆయ‌న అనిల్‌తో ఉండ‌డంతో ఆనంతో పాటు మేక‌పాటి లాంటి వాళ్లు ఆయ‌న‌కు దూరంగా ఉన్నారు. ఈ కార‌ణాల‌తోనే కోటంరెడ్డి కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోవాల్సి వ‌చ్చింది. అయితే మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్న ఆయ‌న ఆశ‌లు ఎంత వ‌ర‌కు నెర‌వేర‌తాయో ? చూడాలి.