Begin typing your search above and press return to search.

దూకుడు పెంచిన కోరుట్ల ఎమ్మెల్యే .. సీఎం ఈ సారైనా కరుణించేనా ?

By:  Tupaki Desk   |   24 Dec 2019 9:25 AM GMT
దూకుడు పెంచిన కోరుట్ల ఎమ్మెల్యే .. సీఎం ఈ సారైనా కరుణించేనా ?
X
రాజకీయాలలో ఏ పదవి శాశ్వతం కాదు. అయినప్పటికీ కూడా రాజకీయ నేతలు పదవుల కోసం ప్రాకులాడుతుంటారు. ఈ పదవుల కోసమే అప్పటివరకు సౌమ్యంగా ఉన్న నేతలు ఒక్కసారిగా తమ ఉగ్రరూపం చూపిస్తుంటారు. అలాగే అప్పటి వరకు పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్నవారు ..పూర్తిగా సైలెంట్ అయి పోతారు. ఏదైనా కూడా పార్టీ లో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికే. గత కొన్ని రోజులుగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు వ్యవహార తీరు కూడా ఇదే విధంగా ఉంది. ఎప్పుడు తన పని తాను చేసుకుంటూ పోయే ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేతల తీరుపై ఒంటి కాలి తో లేస్తున్నారు. పదునైన విమర్శలు చేస్తూ ఓ ఆట ఆడడం మొదలు పెట్టారంటున్నారు.

నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచినా మంత్రి కావాలనే కోరికను మనసుల్లోనే పెట్టుకొని బయటకు గంభీరంగా కనిపిస్తుంటారు విద్యాసాగర్‌రావు. మంత్రి వర్గ విస్తరణ జరిగిన ప్రతిసారి ఆశ పెట్టుకోవడం ..ఆ తరువాత పదవి రాకపోతే మళ్లీ సైలెంట్ అయిపోవడం సర్వ సాధారణం అయి పోయింది. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటూ , వివాదాలకు దూరంగా ఉండే ఆయన ఇప్పుడు విమర్శలు చేస్తూ వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నారు. ఇటీవల కోరుట్ల నియోజకవర్గంలో దిశ ఘటనపై విద్యార్థుల తో ర్యాలీలు నిర్వహించి, ఏకంగా హక్కుల సంఘాలనే విమర్శించడం మొదలు పెట్టారు.

ఇక మీడియా సమావేశం నిర్వహించి పసుపు బోర్డు ఏర్పాటు పై మాట నిలుపుకోని బీజేపీ ఎంపీ అరవింద్ రాజీనామా చేయలంటూ డిమాండ్ చేశారు. నియోజకవర్గం లో ఉన్నా, లేనట్లు కనిపించే విద్యాసాగర్ రావు దూకుడు పెంచిన తర్వాత అభివృద్ధి పనులను సీరియస్‌ గా పరిశీలిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారట. తన నియోజకవర్గం లో నిర్మాణమవుతున్న ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్ పనుల వద్దకు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను తీసుకువెళ్లి ప్రాజెక్టు పని తీరును వివరించారు. అలాగే మంత్రి ఓ పని మీద వస్తే ఎమ్మెల్యే దగ్గరుండి మరీ రివర్స్ పంపింగ్‌ ను చూపించారట. నియోజక వర్గం లో ఉన్న సమస్యల పై ఫోకస్ చేస్తూ పబ్లిక్‌ కు మరింత టచ్‌లో ఉండడం తో ఎమ్మెల్యే లో ఇంత మార్పు ఏంటనేది కోరుట్ల లో చర్చనీయంశం గా మారింది. దీనికి ప్రధాన కారణం ఈసారైనా ముఖ్యమంత్రి తనని గుర్తించి మంత్రి పదవి ఇస్తారనే ఉద్దేశం తోనే నియోజకవర్గం లో దూకుడు పెంచారని మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి ఈసారైనా సీఎం కరుణిస్తాడో లేదో..