Begin typing your search above and press return to search.

కేటీఆరే సీఎం...ఇంకో మంత్రి తాలం

By:  Tupaki Desk   |   5 Jan 2020 10:30 AM GMT
కేటీఆరే సీఎం...ఇంకో మంత్రి తాలం
X
ఓ వైపు తెలంగాణ‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల సంద‌డి కొన‌సాగుతుండ‌గానే...మ‌రోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ త్వరలో సీఎంగా బాధ్యతలు చేపడతారనే ప్రచారం జోరందుకుంది. అదే స‌మ‌యంలో కేటీఆర్‌కు పట్టాభిషేకం జరుగుతుందనే మాటను మంత్రులు ప్ర‌చారంలో పెడుతున్నారు. పది రోజులు నుంచి మొద‌లైన సొంత పార్టీ శ్రేణుల కామెంట్లు... తాజాగా మ‌రింత జోరందుకున్నాయి. తాజాగా ఇంకో మంత్రి సైతం ఇదే మాట‌ను చెప్పుకొచ్చారు.

రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ తర్వాత కేటీఆర్‌నే సీఎంగా చూడాలనుకుంటున్నారని, ఆయనే కాబోయే సీఎం అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇటీవలే తెలంగాణ భవన్లో బహిరంగంగా మాట్లాడారు. దాని అనంత‌రం కేసీఆర్‍ తర్వాత కేటీఆరే సీఎం అవుతారని తాజాగా పంచాయతీరాజ్‍ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు వ్యాఖ్యలు చేశారు. జనమంతా కేసీఆర్‍ తర్వాత కేటీఆర్‍ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని అన్నారు. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత కూడా తర్వాత కేటీఆరే సీఎం అవుతరని హరితహారం కార్యక్రమంలోనే మాట్లాడారు. తాజాగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ... కేటీఆరే సీఎం అవుతార‌ని అన్నారు.

కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అయితే తప్పేమి లేదని టీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత‌ - సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ అన్నారు. తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్ అని ప్ర‌శంసించారు. ఏ బాధ్యతలు అప్పజెప్పినా కేటీఆర్ సమర్థంగా నిర్వర్తించారని కితాబు ఇచ్చారు. కేసీఆర్ తాను అనుకున్న లక్ష్యాలు ఇప్పటికే చాలా వరకు నెరవేర్చారని, వాటిని కేటీఆర్ కొన‌సాగిస్తార‌ని ధీమా వ్య‌క్తం చేశారు. స్వయంగా మంత్రులు, పార్టీ ముఖ్యులు సీఎం కేసీఆర్ తర్వాత కాబోయే తెలంగాణ సీఎం కేటీఆరేనంటూ జపం చేస్తుండటం కొత్త పరిణామమ‌ని అంటున్నారు.