Begin typing your search above and press return to search.

బీచ్ శాండ్ తో కొనేరు అన్ని వందల కోట్లు కొల్లగొట్టాడా?

By:  Tupaki Desk   |   16 April 2016 8:08 AM GMT
బీచ్ శాండ్ తో కొనేరు అన్ని వందల కోట్లు కొల్లగొట్టాడా?
X
దోచుకోవాలనుకునే వారికి పంచభూతాలు సైతం అడ్డురావన్న వాస్తవం మరోసారి నిజం కానుంది. పదేళ్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లో తరచూ కుంభకోణాల గురించి గళం విప్పేవారు. తనకు కానీ అధికారం వస్తే అవినీతిని సహించనని చెప్పుకునేవారు. కానీ.. అదే బాబు హయాంలో ఒక కంపెనీ తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారటం గమనార్హం.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒకప్పటి.. ఇప్పటి స్నేహితుడైన కోనేరు రాజేంద్రప్రసాద్ కు చెందిన ట్రైమాక్స్ కంపెనీ వ్యవహారం ఇప్పుడు పెద్ద ఇష్యూగా మారింది. అక్రమంగా బీచ్ శాండ్ ను కొల్లగొట్టినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 400 ఎకరాల రెవెన్యూ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా తవ్విన బీచ్ శాండ్ విలువ ఏకంగా రూ.1295కోట్లుగా ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ సైతం నిర్ధారించినట్లుగా తెలుస్తోంది.

ఎలాంటి అనుమతులు లేకుండా బీచ్ శాండ్ ను తవ్వి తీసిన వైనంపై విమర్శలతో పాటు.. వందలాది కోట్ల రూపాయిలు కొల్లగొట్టిన ట్రైమాక్స్ నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాల్సిన అవసరం ఉందని.. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మిన్నకుండిపోవటాన్ని ప్రశ్నించాలని విజిలెన్స్ విభాగం తేల్చి చెప్పినట్లు సమాచారం. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ స్థానం నుంచి పోటీ చేసిన కోనేరు ఎన్నికల్లో ఓటమిపాలు కావటం తెలిసిందే. అనంతరం జగన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.ప్రస్తుతం బాబుకు సన్నిహితంగా ఉన్న కోనేరు కంపెనీ మీద వస్తున్న ఆరోపణల నేపథ్యంలో బాబు సర్కారు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.