Begin typing your search above and press return to search.

కాల్పుల‌కు లొంగేది లేదంటున్న‌ కోదండ‌రాం

By:  Tupaki Desk   |   16 Feb 2017 6:23 AM GMT
కాల్పుల‌కు లొంగేది లేదంటున్న‌ కోదండ‌రాం
X
ఈనెల 22న హైదరాబాద్‌ లో చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన నిరుద్యోగుల నిరసన ర్యాలీ విష‌యంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం త‌న ప‌ట్టును ఏమాత్రం వెన‌క్కి త‌గ్గించ‌డం లేదు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తే, ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు కాల్పుల ప్రస్తావన తీసుకురావడం ఎంతవరకు సమంజసమని కోదండ‌రాం ప్రశ్నించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలనే డిమాండ్‌ తో నిరసన చేపట్టేందుకు ప్రయత్నిస్తుంటే పాలకులు కాల్పుల పేరిట ప్రజలను భయాందోళనలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తుపాకీ కాల్పులకు భయపడే సంస్కృతి తెలంగాణలో చిన్నపిల్లవాడికి కూడా లేదని, అలా భయపడే పరిస్థితే ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదని ఆయన అన్నారు. నిరుద్యోగుల ర్యాలీకి మద్దతు కూడ గట్టేందుకు వ‌రంగ‌ల్ లోని కాక‌తీయ యూనివ‌ర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం ఈ సంద‌ర్భంగా పై విధంగా వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఏర్ప‌డ్డ త‌ర్వాత 2014 ఎన్నికల్లో అధికారంలోకి వ‌చ్చిన అనంతరం అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ సమావేశంలో 1.07 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారని కోదండ‌రాం గుర్తు చేశారు. ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో మరో 30 వేలమంది ఉద్యోగాలు పదవీ విరమణ పొందారని చెప్పారు. దీనిని బట్టి రాష్ట్రంలో 1.52 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని అన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కేవలం 15 వేల ఉద్యోగాల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్లు జారీ చేసిందని కోదండ‌రాం తెలిపారు. 11 వేల పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగినా నియామక ఉత్తర్వులు ఇవ్వలేదని, విద్యారంగంలో ఖాళీగా ఉన్న 11 వేల ఉపాధ్యాయ పోస్టులు - 4వ తరగతి ఉద్యోగులకు సంబంధించి 32 వేల పోస్టులు భర్తీ చేయలేదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో మరో 50 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. రెండున్నరేళ్ళ కాలంలో తెరాస ప్రభుత్వం చెప్పుకోదగిన స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయలేదన్నారు. దీంతో తెలంగాణ‌లోని మెజార్టీ యువ‌త నిరుద్యోగులుగా మిగిలిపోవాల్సి వ‌స్తున్న‌ద‌ని వ్యాఖ్యానించారు. ఉద్యమ ట్యాగ్‌ లైన్ మరిచిన ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల పోకడలతో తెలంగాణలో నిరుద్యోగ సమస్య పెరిగిందని, కొత్త రాష్ట్రంలో దీనికి చరమగీతం తథ్యమనుకుంటే మరింత పెరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపట్ల తెలంగాణ పౌరసమాజంలోని నిరసన తెలపటానికి ఈనెల 22న హైదరాబాద్‌ లో ‘మా కొలువులు మాకు కావాలి’ అనే నినాదంతో నిరసన ర్యాలీని చేపడుతున్నామని కోదండ రాం చెప్పారు. రాజకీయ అవసరాల కోసం కాకుండా నిరుద్యోగ సమస్యను నిర్మూలించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపాలన్న లక్ష్యంతో ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఖాళీలు ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలని, ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ప్రైవేట్ రంగ ఉద్యోగాల భర్తీలో స్థానిక రిజర్వేషన్ల విధానం అమలు చేయాలని కోదండ‌రాం డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/