Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ ఉప పోరులో కాంగ్రెస్ లో ఆమె పేరు మిస్?

By:  Tupaki Desk   |   29 Sep 2021 6:40 AM GMT
హుజూరాబాద్ ఉప పోరులో కాంగ్రెస్ లో ఆమె పేరు మిస్?
X
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయటంతో ఇప్పడు ఎన్నిక ఎప్పుడు జరుగుతుందన్న క్లారిటీ వచ్చేసింది. అధికార టీఆర్ఎస్.. బీజేపీలు ఇప్పటికే తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించేవారు. వారు ప్రచారం చేసుకుంటున్నారు కూడా. కానీ.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటివరకు తన అభ్యర్థి ఎవరన్న విషయాన్ని తేల్చలేదు. ఆచితూచి అన్నట్లుగా.. వేచి చూసే ధోరణితో అభ్యర్థి ఎంపిక విషయంలో రేవంత్ వ్యవహరిస్తున్నారు. దీనిపై సీనియర్లు గుర్రుగా ఉన్నా.. అభ్యర్థి ఎంపిక అన్నది వ్యూహాత్మకంగా సాగాలన్నట్లుగా రేవంత్ టీం ఉంది.

ఎవరెన్ని చెప్పినా.. ఎలాంటి అభ్యర్థి నిలిచినా ఈ ఉప పోరులో కాంగ్రెస్ కు ఏ మాత్రం అవకాశం లేదు. ఆ విషయం కాంగ్రెస్ నేతలందరికి తెలిసిందే. అలా అని పోటీని నిలపకుండా ఉండటం సాధ్యం కాని పని. అందుకే.. ఆలోచించి మరీ అభ్యర్థిని ఎంపిక చేయాలన్న యోచనలో రేవంత్ ఉన్నట్లు చెబుతారు. ఇంతకాలం నడిచింది కానీ.. ఉప పోరు షెడ్యూల్ వచ్చేసిన వేళ.. పార్టీ అభ్యర్థిని తేల్చాల్సిన సమయం వచ్చేసింది.

ఇప్పటికే ఈ ఉప పోరులో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే వారికి సంబంధించి పలువురి పేర్లు వినిపించాయి. ఒక్కో పేరకు ఒక్కో వాదన వినిపిస్తూ వస్తున్నారు. తాజాగా నలుగురు పేర్లతో కూడిన జాబితాను పంపినట్లుగా చెబుతున్నారు. ఈ లిస్టులో ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ పేరు లేనట్లుగా చెబుతున్నారు. తాజాగా షార్ట్ లిస్టు చేసిన పేర్లలో పాత వాటితో పాటు కొత్త పేర్లు కూడా చేరాయని ెబుతన్నారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. దామోదర రాజనర్సింహలతో కూడిన కమిటీ అభ్యర్థి ఎంపిక కసరత్తును పూర్తి చేసి.. అధినాయకత్వానికి జాబితనాు పంపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకుఅందులో నాలుగు పేర్లు ఉన్నట్లుగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి భారీగానే ఓట్లు రాబట్టారు. ఆయన ప్రస్తుతం టీఆర్ఎస్ లో చేరటంతో కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో సరైన అభ్యర్థి ఎంపిక తప్పని పరిస్థితి. తాజాగా పంపిన పేర్లలో క్రిష్ణారెడ్డి.. రవికుమార్.. ప్యాట రమేశ్.. దళిత సామాజిక వర్గానికి చెందిన సైదులు పేరును పంపినట్లుగా తెలుస్తోంది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఒక సమయంలో వినిపించిన కొండా సురేఖ పేరుతో పాటు పొన్నం ప్రభాకర్ పేరు కూడా తాజా జాబితాలో లేకపోవటం చూస్తే.. ఈ ఉప పోరు వేళ.. పెద్ద నేతల్ని బరిలోకి దింపి భంగపడే కన్నా.. పోటీ చేశామా? అంటే పోటీచేశామా? అన్నట్లు ఉనికిని ప్రదర్శించుకోవటమే ముఖ్యమన్నట్లుగా వ్యవహారం ఉందన్న మాట వినిపిస్తోంది. పేరున్ననేతల్ని బరిలోకి దింపి.. ఒకవేళ ఓట్లు ఓ మోస్తరుగా రాకుంటే పార్టీకి జరిగే నష్టం మామూలుగా ఉండదు. అందుకే.. తమకు సినిమా లేని ఉప పోరులో అనవసర హడావుడికి వీలైనంత దూరంగా ఉండాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది.