Begin typing your search above and press return to search.

కొండా మురళిని అంతం చేసేందుకు ఎర్రబెల్లి కుట్రలు: కొండా సురేఖ

By:  Tupaki Desk   |   13 Oct 2021 4:28 AM GMT
కొండా మురళిని అంతం చేసేందుకు ఎర్రబెల్లి కుట్రలు: కొండా సురేఖ
X
తెలంగాణ రాజకీయాల్లో రాయలసీమ ఫ్యాక్షన్ లో పగలు ప్రతీకారాలతో రగిలిపోయే రెండు ఫ్యామిలీలున్నాయి. అవే కొండా సురేఖ-మురళి వర్సెస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వర్గాలు. వీరిద్దరూ గతంలో కాంగ్రెస్, టీడీపీలలో ఉంటూ ఆధిపత్యం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి వరంగల్ లో నెత్తుటి రాజకీయాలు చేశారనే విమర్శలున్నాయి. వరంగల్ లో ఎవరిని అడిగినా రాజకీయ శత్రువులు ఎవరంటే కొండా వర్సెస్ ఎర్రబెల్లిలనే చెబుతారు. కాలం మారినా వీరి పగలు ప్రతీకారాలు మాత్రం మారలేదంటారు.

టీఆర్ఎస్ లో ఎర్రబెల్లితో పడకనే కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్ గూటికి చేరారు. పరస్పరం విమర్శల కత్తులు దూసుకుంటూనే ఉన్నారు. తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై కాంగ్రెస్ నేత కొండా సురేఖ తీవ్రస్థాయిలో సంచలన విమర్శలు గుప్పించారు. ఎర్రబెల్లి పుట్టుక, హత్య రాజకీయాలపై తీవ్ర విమర్శలు చేశారు.

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి బొడ్రాయి ప్రతిష్టాపనలో పాల్గొన్న కొండా సురేఖ ఈ సందర్భంగా ఎర్రబెల్లిపై సంచలన ఆరోపణలు చేశారు. ‘తన భర్త మురళిని అంతం చేసేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుట్రలు చేస్తున్నారని’ ఆరోపించారు. అందుకే ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరారని ఆమె ఆరోపించారు. తాము టీఆర్ఎస్ లో చేరిన తర్వాతే ఎర్రబెల్లి కూడా పార్టీలో చేరి రాజకీయాలు చేశాడని మండిపడ్డారు.

ఒక తండ్రికే పుట్టానని.. టీడీపీని విడిచిపెట్టనని ఎర్రబెల్లి నాడు శపథాలు చేసి ఆ తర్వాత టీఆర్ఎస్ లో ఎందుకు చేరాడని కొండా సురేఖ ప్రశ్నించారు.ఎంత మంది తండ్రులకు పుట్టుంటే టీఆర్ఎస్ లో చేరారో చెప్పాలని సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాము కూడా టీడీపీలో చేరాలని అనుకున్నామని.. చంద్రబాబు ఆహ్వానించారని.. కానీ ఆ పార్టీలో ఎర్రబెల్లి ఉండడంతోనే చేరలేదని సంచలన విషయాలు చెప్పుకొచ్చారు.

కొండా మురళి-సురేఖ.. పరకాలతో పాటు వరంగల్ జిల్లా మొత్తం ప్రభావం చూపగల నేతలు. అందుకే పోయిన సారి వరంగల్ తూర్పులో పోటీచేసినా సురేఖ గెలిచారు.కానీ రెండో దఫా మాత్రం టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు.. కాంగ్రెస్ లో చేరి పరకాల నుంచి పోటీచేసిన సురేఖ ఓడిపోయింది.

తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్, టీఆర్ఎస్ హవా నడుస్తోంది. ఆ గాలికి ఎదురెళ్లి గెలవడం కష్టమని అందరికీ అర్థమైంది. అందుకే కాంగ్రెస్ నేతల్లో భయం వెంటాడుతోంది. తాజాగా హుజూరాబాద్ టికెట్ తోపాటు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా టికెట్ ఇస్తానన్నా కొండా మురళి కానీ.. సురేఖ కానీ సాహసించ లేదంటే టీఆర్ఎస్ హవానే కారణం.. ఎదురెళ్లి మళ్లీ ఓడిపోవడం ఇష్టం లేకే వారు టికెట్ ను వదులుకోవడం విశేషం. ఇప్పుడు ఎర్రబెల్లిపై సురేఖ చేసిన వ్యాఖ్యలతో వీరివైరం మరోసారి బయటపడినట్టైంది.