Begin typing your search above and press return to search.

కోన‌సీమ అల్ల‌ర్ల‌కు నేటితో నెల పూర్తి.. జిల్లా పేరు మార్పుపై నేడు నిర్ణ‌యం!

By:  Tupaki Desk   |   24 Jun 2022 5:48 AM GMT
కోన‌సీమ అల్ల‌ర్ల‌కు నేటితో నెల పూర్తి.. జిల్లా పేరు మార్పుపై నేడు నిర్ణ‌యం!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కోన‌సీమ జిల్లాకు అంబేడ్క‌ర్ పేరును నిర్ణ‌యించ‌డంపై మే 24న అమ‌లాపురంలో విధ్వంసం, అల్ల‌ర్లు చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కోన‌సీమ ప‌రిర‌క్ష‌ణ స‌మితి నేతృత్వంలో జ‌రిగిన ఆందోళ‌న‌లో నిర‌స‌న‌కారులు ప‌లు ప్రైవేటు, ప్ర‌భుత్వ ఆర్టీసీ బ‌స్సుల‌ను, పోలీసు వాహ‌నాల‌ను ద‌హ‌నం చేశారు.

అంతేకాకుండా ర‌వాణా శాఖ మంత్రి పినిపె విశ్వ‌రూప్, ముమ్మిడివ‌రం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పొన్నాడ స‌తీష్ కుమార్ ఇళ్ల‌కు నిప్పు పెట్టారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ కేసులో పోలీసులు 217 మందిని అరెస్టు చేశారు. కేసును త్వ‌ర‌గా ద‌ర్యాప్తు చేయ‌డానికి, పరారీలో ఉన్న నిందితుల‌ను అరెస్టు చేయ‌డానికి ప్ర‌త్యేక పోలీసుల బృందాల‌ను సైతం ఏర్పాటు చేశారు. అలాగే నిందితుల‌పై రౌడీషీట్లు తెర‌వ‌నున్నారు. జ‌రిగిన న‌ష్టానికి సంబంధించి నిర‌స‌న‌కారుల ఆస్తుల‌ను స్వాధీనం చేసుకోనున్నారు.

అమ‌లాపురంలో విధ్వంసం, అల్ల‌ర్లు చోటు చేసుకుని జూన్ 24కు నెల రోజులు పూర్త‌య్యాయి. అయితే ఇప్ప‌టికి అక్క‌డ 144 సెక్ష‌న్, 30 సెక్ష‌న్ కొన‌సాగుతున్నాయి. ఇంట‌ర్నెట్ పై విధించిన నిషేధం కొద్దిరోజుల క్రితం ఎత్తేశారు. కాగా మ‌రోవైపు మే 18 నుంచి జూన్ 18 వ‌ర‌కు కోన‌సీమ జిల్లా పేరు మార్పుకు సంబంధించి అభ్యంత‌రాల స్వీక‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం విధించిన గ‌డువు కూడా పూర్తియ్యింది.

మే 18 నుంచి జూన్ 18 వ‌ర‌కు జిల్లా పేరు మార్పు అంశంపై ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల నుంచి అభ్యంత‌రాలు, సూచ‌న‌లు, స‌ల‌హాలు స్వీక‌రించింది. కోన‌సీమ జిల్లాలోని 22 మండ‌లాల్లో ప్ర‌జ‌ల నుంచి అభ్యంత‌రాలు స్వీక‌రించారు. దాదాపు ఆరు వేల మంది అభిప్రాయాల‌ను జిల్లా అధికారులకు పంపిన‌ట్టు సమాచారం. అందులో ప్ర‌జ‌లు వివిధ అభిప్రాయాలు వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో జూన్ 24న శుక్ర‌వారం జ‌ర‌గ‌నున్న‌ ఏపీ మంత్రివర్గ సమావేశంలో కోన‌సీమ జిల్లా పేరు మార్పు అంశాన్ని చ‌ర్చించే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. సున్నితమైన అంశం కావటంతో ప్రభుత్వం జిల్లా అధికారుల నివేదిక ఆధారంగా..మెజార్టీ అభిప్రాయం మేరకు పేరును ప్రకటిస్తుందా..లేక, ఎటువంటి వివాదం లేకుండా ఈ సమస్య పరిష్కరించేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తుందా అనేది ఈ సమావేశంలో తేలే అవకాశం కనిపిస్తోంది.

అయితే.. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన అభిప్రాయాలు ఏవైనా ప్ర‌భుత్వం మాత్రం కోన‌సీమ జిల్లాకు అంబేడ్క‌ర్ పేరును కొన‌సాగించే ఉద్దేశంతోనే ఉంద‌ని తెలుస్తోంది. అల్ల‌ర్లు, విధ్వంసం చోటు చేసుకున్ననాటి నుంచే ప్ర‌భుత్వం, వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు, మంత్రులు కోన‌సీమ జిల్లాకు అంబేడ్క‌ర్ పేరే కొన‌సాగుతుంద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం కోన‌సీమ జిల్లాకు అంబేడ్క‌ర్ పేరు కొన‌సాగిస్తుంద‌ని తెలుస్తోంది.