Begin typing your search above and press return to search.

టీపీసీసీ కొత్త అధ్యక్షడి గా కోమటి రెడ్డి ... ఎవరు చెప్పారంటే ?

By:  Tupaki Desk   |   23 Nov 2019 11:36 AM GMT
టీపీసీసీ కొత్త అధ్యక్షడి గా కోమటి రెడ్డి ... ఎవరు చెప్పారంటే ?
X
తెలంగాణ లో కాంగ్రెస్ పరిస్థితి అంతకంతకు దిగజారిపోతుందా? అంటే ఎక్కువ శాతం మంది అవుననే చెప్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అయినప్పటికీ ..పార్టీ నేతలు ఆ విషయాన్ని క్యాష్ చేసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ కీలక నేతలు అనుకున్న వారంతా కారెక్కేసారు. ఇక దీనితో ప్రస్తుతం పట్టుమని పదిమంది కూడా కీలకనేతలు పార్టీలో లేరు. ఇక మొన్నటి ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపినట్టు కనిపించలేదు. ఇక తాజాగా హుజూర్ నగర్ ఉపఎన్నికలలోను కాంగ్రెస్ తన సీటుని నిలబెట్టుకోలేక పోయింది. ఈ పరిస్థితి చూస్తే ఎవరైనా చెప్తారు ..తెలంగాణ లో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటో...

ఇక ఇటువంటి సమయంలో తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త సారధి రాబోతున్నాడనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో వారం పదిహేను రోజుల్లో పీసీసీ చీఫ్‌ మార్పులు జరుగ బోతున్నాయి అని , అలాగే పీసీసీ రేసు లో అందరికంటే తానే ముందున్నానన్నారు. ఇక త్వరలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా టీపీసీసీ పదవి నుంచి వైదొలగనున్నారని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు కూడా తనకే ఇస్తున్నారని తెలిపారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నానని.. ఇందు కోసం అధిష్టానం అనుమతి కూడా కోరబోతున్నట్టు తెలిపారు. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఈ పాదయాత్ర ప్రారంభిస్తానన్నారు.

ఇదిలా ఉంటే.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి కూడా ఇటీవల తన మనసులో ఉన్న మాటను తెలిపారు. తాను కూడా టీపీసీసీ రేసులో ఉన్నానన్నారు. తనకు టీపీసీసీగా అవకాశమిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. జగ్గారెడ్డితో పాటు.. మరికొందరు కూడా ఈ రేసులో ఉన్నట్లు తెలిసింది. కాగా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యల తో అధిష్టానం కూడా వెంకట్ రెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్ నేతృత్వంలో పార్టీ అధికారంలోకి రాదంటూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. తమకు పీసీసీ పగ్గాలు ఇస్తే.. పార్టీ సజీవంగా బతకడమే కాకుండా.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత అయన బీజేపీ లోకి వెళ్తున్నట్టు ప్రకటించినా .. కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఇదంతా కూడా పీసీసీ పదవి కోసమే అని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.