Begin typing your search above and press return to search.

రెండు నాలుకల ధోరణి మంచిది కాదు!

By:  Tupaki Desk   |   7 March 2020 12:51 PM GMT
రెండు నాలుకల ధోరణి మంచిది కాదు!
X
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైన రెండోరోజే హాట్ హాట్‌ గా సాగుతున్నాయి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం సభలో సమాధానం చెప్పారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పూర్తి అసత్యం అని, నోరు ఉంది కదా అని సభలో ఇష్టారాజ్యంగా మాట్లాడతాం అంటే కుదరదు అంటూ హెచ్చరించారు. ఈ రోజు సభలో చొక్కాలు చించుకుంటున్నవారు.. ఒకప్పుడు సమైక్య పాలకుల చెంతన చేరి రాష్ట్రాన్ని ఇబ్బందులపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అనేక అభివృద్ది పనులకు అడ్డుపడుతూ ..మరోవైపు ప్రభుత్వం ఏమిచేయడంలేదు అని విమర్శలు చేయడం మీకే చెల్లింది అంటూ మండిపడ్డారు.

ముఖ్యంగా మిషన్ భగీరథ, రాష్ట్రంలో 33 జిల్లాల ఏర్పాటు వంటి అంశాలపై రాజగోపాల్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ భగీరథ స్కీమ్ అద్భుతమైన పథకమని , దేశంలోని 11 రాష్ట్రాల ప్రభుత్వాలు తెలంగాణకు వచ్చి ప్రాజెక్టును పరిశీలించాయన్నారు. కేంద్రం కూడా దాన్ని స్పూర్తిగా తీసుకుని 2024కల్లా ప్రతీ ఇంటికి నల్లా నీళ్లు ఇస్తామన్న హామీ ఇచ్చిందన్నారు. మిషన్ భగీరథకు తానే డిజైనర్, ఆర్కిటెక్ట్ అని చెప్పిన కేసీఆర్.. ఆ ప్రాజెక్టు ఫెయిల్ అనే ప్రశ్నే ఉండదు అని తెలిపారు.

నల్లగొండలో ఫ్లోరైడ్ నీళ్లు తాగి నడుములు ఒంగిపోయిన దుస్థితికి కాంగ్రెస్ కారణం కాదా అని రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నించారు. ఆ దుస్థితిని చూడలేకనే.. మిషన్ భగీరథ శిలాఫలాకాన్ని మునుగోడు నియోజకవర్గంలోనే వేశామని , భారత జలశక్తి నిపుణులు సైతం నల్గొండకు వచ్చి మిషన్ భగీరథ నీళ్లను పరిశీలించారన్నారు. జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య పోయిందని.. స్వచ్చమైన తాగునీరు వస్తోందని వారే స్టేట్‌మెంట్ ఇచ్చారన్నారు. మిషన్ భగీరథకు సంబంధించి రాష్ట్రంలోని 12750 గ్రామ పంచాయతీల్లో 8600 పైచిలుకు గ్రామ పంచాయతీలు.. అలాగే అన్ని నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేల తీర్మానాలు తెప్పించుకున్నామని చెప్పారు.

అందులో మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాల సర్పంచ్‌ల తీర్మానాలు.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీర్మానం కూడా ప్రభుత్వానికి చేరిందన్నారు. తన నియోజకవర్గానికి మునుగోడు నీళ్లు వస్తున్నాయని సంతకం పెట్టిన రాజగోపాల్ రెడ్డే.. ఇప్పుడు సభలో తమకు నీళ్లు రావడం లేదని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రెండింటిలో ఆయన ఇచ్చిన తీర్మానాన్ని నమ్మలా లేక.. ఇప్పుడు సభలో చేసిన వ్యాఖ్యలను నమ్మాలా అని ప్రశ్నించారు. సభను ఇంత ఘోరంగా తప్పుదోవ పట్టించిన రాజగోపాల్ రెడ్డి ఇక్కడ ఉండేందుకు అర్హులా అని ప్రశ్నించారు

అలాగే , కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిన శ్రద్ద పాలమూరు రంగారెడ్డి - డిండిపై కూడా పెట్టాలని రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ దీటుగా సమాధానం ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డిపై కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నది రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. సింగిల్ బెంచ్ - డివిజిన్ బెంచ్ చీవాట్లు పెట్టిన తర్వాత కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. సభలో మంత్రులపై కోపానికి రావడం.. ఇష్టమొచ్చినట్టు తిట్టడం పద్దతి కాదు అని - ఒకసారి అలోచించి మాట్లాడాలి అని సీఎం కేసీఆర్ కోరారు.