Begin typing your search above and press return to search.

పార్టీ మార్పులపై స్పందించిన కోమటిరెడ్డి

By:  Tupaki Desk   |   24 July 2022 11:30 AM GMT
పార్టీ మార్పులపై స్పందించిన కోమటిరెడ్డి
X
కాంగ్రెస్ లో ఎదిగిన కోమటిరెడ్డి ఫ్యామిలీ అవసరార్థం వేరే పార్టీలోకి చేరడానికి ప్రయత్నించినా డీల్ సెట్ కాలేదన్న ప్రచారం ఉంది. వీళ్లు గతంలో బీజేపీలోకి.. టీఆర్ఎస్ లోకి ఆఫర్ వచ్చినా ఎందుకో చేరలేదంటారు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలవడంతో మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే తాజాగా కోమటిరెడ్డి స్పందించాడు.

బీజేపీలో చేరబోతున్నట్లు వచ్చిన వార్తలను మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే అమిత్ షాను కలవడం కొత్త కాదని.. అనేకసార్లు కలిసినట్లు చెప్పారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. అమిత్ షాతో భేటి కావడం అందరి సమక్షంలోనే జరిగినట్లు వివరించారు.

కాంగ్రెస్ తోపాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతి, ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నానని చెప్పారు. పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురిచేసే కుట్రకు తెలరలేపారని ఆరోపించారు. ఈ ప్రచారంపై కార్యకర్తలు, పార్టీ అభిమానులు ఎలాంటి గందరగోళానికి గురికావద్దని అన్నారు.

పార్టీ వీడే పరిస్థితి వస్తే భువనగిరి, మునగోడు నియోజకవర్గ ప్రజలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని కోమటిరెడ్డి స్పష్టం చేశాడు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తాను రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తున్నందున ప్రచారం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

ఇదంతా కేసీఆర్ ఆడుతున్న నాటకమని నన్ను చూసి కేసీఆర్ భయపడుతున్నారని.. అందుకే ఇలాంటి ప్రచారం మొదలుపెట్టారని విమర్శించారు. తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన మాట వాస్తవమేనని.. తాను బహిరంగంగానే కలిశానని తెలిపారు. తన నియోజకవర్గంలో అర్హులందరికీ దళితబంధు అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని మళ్లీ పోటీ చేయనని అన్నారు. తెలంగాణలో రాచరికపు పాలన సాగుతుందని కోమటిరెడ్డి విమర్శించారు