Begin typing your search above and press return to search.

బీజేపీ ఉచ్చులో రాజ‌గోపాలరెడ్డి.. ఆత్మ‌హ‌త్యాస‌దృశ్య‌మేనా..!

By:  Tupaki Desk   |   24 July 2022 7:31 AM GMT
బీజేపీ ఉచ్చులో రాజ‌గోపాలరెడ్డి.. ఆత్మ‌హ‌త్యాస‌దృశ్య‌మేనా..!
X
మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల‌రెడ్డి రాజీనామా దిశ‌గా క‌దులుతున్నారా..? కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేర‌నున్నారా..? ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేసే యోచ‌న‌లో ఉన్నారా..? ఇదే జ‌రిగితే అది ఆత్మ‌హ‌త్యాస‌దృశ్య‌మేనా..? త‌న గోతిని త‌నే త‌వ్వుకుంటున్నారా..? ఆ పార్టీ ఉచ్చులో ఇరుక్కుంటున్నారా..? అంటే రాజ‌కీయ వ‌ర్గాల్లో అవున‌నే స‌మాధానాలు వ‌స్తున్నాయి.

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో బ‌ల‌మైన నేత‌లుగా పేరు క‌లిగిన కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ లో ఒక‌రైన రాజ‌గోపాలరెడ్డి ఆయ‌న అన్న వెంకట రెడ్డి ద్వారా రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. 2009లో భువ‌న‌గిరి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గెలుపొంది పార్ల‌మెంటులో అడుగుపెట్టారు. 2014లో అదే స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్య‌ర్థి బూర న‌ర్స‌య్య చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఎమ్మెల్సీగా గెలుపొంది మండ‌లి స‌భ్యుడ‌య్యారు.

2018 శాస‌న‌స‌భ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో భాగంగా మునుగోడు నుంచి బ‌రిలో నిలిచి టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డిపై విజ‌యం సాధించారు. అయితే సీఎల్పీ లీడ‌ర్ పోస్టు ఆశించి భంగ‌ప‌డ్డారు. ఆ ప‌ద‌విని అధిష్ఠానం భ‌ట్టి విక్రమార్క‌కు క‌ట్ట‌బెట్ట‌డంతో రాజ‌గోపాల‌రెడ్డి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. క‌నీసం ఆయ‌న సోద‌రుడు వెంక‌ట రెడ్డికి అయినా పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశించారు. అది కాస్తా రేవంతుకు వెళ్ల‌డంతో అప్ప‌టి నుంచీ ముభావంగా ఉన్నారు.

అయితే కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణ‌యాల‌పై రాజ‌గోపాల‌రెడ్డి ఎప్ప‌టి నుంచో అసంతృప్తిగా ఉన్నారు. వ‌చ్చేది బీజేపీ ప్ర‌భుత్వ‌మేన‌ని మూడేళ్ల క్రిత‌మే కార్య‌క‌ర్త‌ల బ‌హిరంగ స‌మావేశంలో ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అప్ప‌టి రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి కుంతియాపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న అప్పుడే పార్టీకి రాజీనామా చేస్తార‌ని భావించారు. కానీ ఎందుకో సైలెంట్ అయ్యారు. మ‌ళ్లీ తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావ‌డంతో రాజీనామా దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే రాజగోపాల‌రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నిక వ‌చ్చినా ఆయ‌న ప‌ట్ల ప్ర‌జ‌ల్లో సానుభూతి లేద‌ని తెలుస్తోంది. మూడేళ్లుగా నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం.. అభివృద్ధి ప‌నులు జ‌ర‌గ‌క‌పోవ‌డం.. పూట‌కో మాట‌తో ఏ పార్టీలో ఉంటారో తెలియ‌ని ప‌రిస్థితి క‌ల్పించ‌డం.. ఆయ‌న ప‌ట్ల కాంగ్రెస్ శ్రేణులు విశ్వ‌స‌నీయ‌త కోల్పోవ‌డం వంటి అంశాల‌తో ఆయ‌న ప‌లుచ‌న అయిన‌ట్లు స‌మాచారం. పైగా అక్క‌డ బీజేపీకి ఏమాత్రం బ‌లం లేక‌పోవ‌డం ప్ర‌తికూలంగా మారే ప్ర‌మాదం ఉంది.

మునుగోడు కాంగ్రెస్ కంచుకోట స్థానం కావ‌డం.. మాజీ మంత్రి పాల్వాయి గోవ‌ర్ధ‌న్ రెడ్డి కూతురు స్ర‌వంతి రూపంలో బ‌ల‌మైన అభ్య‌ర్థి ఉండ‌డం ఆ పార్టీకి క‌లిసొచ్చే అంశంగా మార‌నుంది. ఇక్క‌డ ప్ర‌ధాన పోటీ అధికార టీఆర్ఎస్‌, హ‌స్తం పార్టీ మ‌ధ్యే ఉంటుంద‌ని.. బీజేపీ మూడో స్థానానికే ప‌రిమితం అవుతుంద‌ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జలు చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఇంత‌టి ప్ర‌తికూల‌త‌ల మ‌ధ్య రాజ‌గోపాల‌రెడ్డి రాజీనామా చేసే ధైర్యం చేయ‌గ‌ల‌రా..? అది ఆయ‌న స్వ‌యంకృతాప‌రాధ‌మే అవుతుందా..? లేదా త‌న వ్య‌క్తిగ‌త బ‌లంతో బీజేపీని గెలిపించ‌గ‌ల‌రా..? అనేది వేచి చూడాలి.