Begin typing your search above and press return to search.

న‌యీం మ‌నుషులంతా టీఆర్ ఎస్ నాయ‌కులే

By:  Tupaki Desk   |   21 Aug 2016 5:52 AM GMT
న‌యీం మ‌నుషులంతా టీఆర్ ఎస్ నాయ‌కులే
X
మాఫియా డాన్ న‌యీం కేసులో కాంగ్రెస్ నాయకుడు - ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మ‌రోమారు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఐదు రాష్ట్రాలలో వేలకోట్ల ఆస్తులు కూడబెట్టిన నయీంతో పూర్తిగా అంటకాగిన వారు టీఆర్‌ ఎస్ పార్టీకి చెందిన ముఖ్య‌నేత‌లేన‌ని కోమ‌టిరెడ్డి ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన వారు ఉన్నందువల్ల సీఎం కేసిఆర్ ఆధ్వర్యంలో విచారణ చేసే సిట్ వల్ల బాధితులకు న్యాయం జరగదన్నారు. టీఆర్‌ ఎస్ నాయకులకు శిక్ష పడుతుందని తాము భావించడం లేదని, ఆ విచారణపై తమకు నమ్మకం లేదన్నారు. అందుకే నయీం విచార‌ణ కేసును సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను ఆయ‌న కోరారు. తనను ఎన్నికల్లో ఓడించడానికి అధికార టీఆర్‌ ఎస్ నాయకులు నయీంతో బెదిరింపులకు గురిచేశారని, లేదంటే తనకు 500 ఓట్ల మెజారిటీ వచ్చేదని రాజ‌గోపాల్ రెడ్డి వివరించారు.

ఇదిలాఉండగా...సంచలనం సృష్టిస్తోన్న నయీం వ్యవహారంలో అధికారపార్టీ పెద్దలు ఉన్నారన్న వార్తలు సిట్ విచారణపై అనుమానాలకు తెరలేపుతున్నాయనే చ‌ర్చ సాగుతోంది. విచారణను సీబీఐకి అప్పగిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ప్ర‌తిప‌క్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. నయీం ఘోరాలు ఒక్క తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా ఏపీ - కర్నాటక - ఢిల్లీ - చత్తీస్‌ గఢ్‌ కూ విస్తరించినందున, కేసును సీబీఐకి అప్పగించడమే సబబన్న వాదన తెరపైకి వస్తోంది. ప్రస్తుతం తెరాసలో ఉన్న మంత్రులు - ఎంపిలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీల పేర్లు నయీం కేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే నయీంకు ఎవరెవరితో సంబంధాలున్నాయన్న దానిపై పేర్లతో సహా చర్చ జరుగుతోంది. అందులో ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ల నుంచి తెరాస - కాంగ్రెస్ - తెదేపా నేతల వరకూ ఉన్నారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, అందులో చోటు చేసుకున్న వారంతా ఒక్కొక్కరు బయటకు వచ్చి, నయీంతో తమకెలాంటి సంబంధాలు లేవని మీడియాకు వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఒకడుగు ముందుకేసి, తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై విచారణ జరపాలని ఫిర్యాదు చేసేంతవరకూ వెళ్లారు. మాజీ డీజీపీ దినేష్‌ రెడ్డి - మరో పోలీసు అధికారి శివశంకర్‌ రెడ్డి కూడా స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసి తమకు నయీంతో ఎలాంటి సంబంధాలు లేవని వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కీలక స్థానాల్లో ఉన్న ఐపిఎస్ అధికారుల పేర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు నయీం ఎన్‌ కౌంటర్ నుంచి అతని బినామీ ఆస్తులు - అతని వెనుక ఉన్న అదృశ్య శక్తులు - వాడుకున్న ప్రముఖుల పేర్లు బయటకు రావాలంటే సీబీఐ విచారణే సరైనదన్న అభిప్రాయం సాధారణ ప్రజల్లో కూడా వ్యక్తమవుతోంది. నయీంతో చెట్టపట్టాల్ వేసుకున్న వారిలో ఎక్కువమంది అధికారపార్టీ ప్రముఖులే ఉండటంతో, వారిని ప్రశ్నించి నిజాలు రాబడితే అధికారపార్టీ ఇబ్బందుల్లో పడుతుందనేఈ డిమాండ్‌ను ప‌క్క‌న‌పెడుతున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.