Begin typing your search above and press return to search.

టీపీసీసీ అధ్యక్షడి ఎంపికపై వీడని ఉత్కంఠ .. మళ్లీ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన కోమటిరెడ్డి !

By:  Tupaki Desk   |   21 Jun 2021 7:30 AM GMT
టీపీసీసీ అధ్యక్షడి ఎంపికపై వీడని ఉత్కంఠ ..  మళ్లీ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన కోమటిరెడ్డి !
X
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంపై ఉత్కంఠ అలాగే , కొనసాగుతుంది. కొత్త అధ్యక్షుడి ఎంపిక కాంగ్రెస్ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఏకాభిప్రాయంతో అధ్యక్షుడి ఎంపిక జరగాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్న ఏఐసీసీకి రాష్ట్ర సీనియర్ నాయకుల నుంచి అడుగడునా ఆటంకాలే. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ముందే కొత్త పీసీసీ ప్రకటన జరగాల్సి ఉండగా మాజీ మంత్రి జానారెడ్డి లేఖతో ఆగింది. అప్పట్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చకు వచ్చింది. సాగర్ ఉపఎన్నిక తర్వాత పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, కార్యవర్గ కూర్పు జరగాల్సి ఉందని ప్రచారం జరిగింది. సామాజిక సమీకరణాల వల్ల కొంత ఆలస్యమైనట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా పీసీసీ అధ్యక్షుడు ఎంపిక అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. గడిచిన మూడు, నాలుగు రోజులుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్, ఏఐసీసీ ఇంఛార్జీలు బోసురాజు, శ్రీనివాసన్ కృష్ణన్లు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులకు ఫోన్ చేసి పీసీసీ, కార్యవర్గ కూర్పునకు అభిప్రాయాలు తెలుసుకున్నారు.

పీసీసీ అధ్యక్షుడి కోసం పోటీపడుతున్న వారితోపాటు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో మాట్లాడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ముఖ్య నేతల అభిప్రాయలనూ నివేదిక తయారు చేసి నివేదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పీసీసీ పదవిని ఆశిస్తున్న వారి జాబితాను రాష్ట్ర ఇంఛార్జీ మాణికం ఠాగూర్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరికి పార్టీతో ఉన్న అనుబంధం, బలాలు, బలహీనతలు అన్ని వివరాలతో కూడిన నివేదిక తయారైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే..ఆదివారం టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పుట్టిన రోజు కావడంతో శుభాకాంక్షలు తెలిపేందుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి హైదరాబాద్‌ లోని ఉత్తమ్‌ నివాసానికి వెళ్లారు.

ఈ సందర్భంగా ఇరువురు నేతలు మూడు గంటల పాటు భేటీ అయ్యారు. టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం, ఢిల్లీ పెద్దల ఆలోచన, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఇద్దరు చర్చించారని సమాచారం. ఈ భేటీ తర్వాత సాయంత్రం ఎంపీ కోమటిరెడ్డి హడావుడిగా ఢిల్లీ వెళ్లిపోవడం ఇప్పుడు పెద్ద చర్చ కి దారితీస్తుంది. ఉత్తమ్‌ తో భేటీ తర్వాత ఢిల్లీ ఫ్లైట్‌ ఎక్కడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది. ఇటీవలే కోమటిరెడ్డి ఢిల్లీ వెళ్లి నాలుగు రోజులు అక్కడే ఉండి వచ్చారు. తన పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి కేంద్ర ప్రభుత్వం పెద్దలను కలసిన ఆయన పనిలో పనిగా కాంగ్రెస్‌ పెద్దలనూ కలసివచ్చారు. గత పర్యటనలో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కె.సి.వేణుగోపాల్‌ను కలసిన కోమటిరెడ్డి తనను పీసీసీ అధ్యక్షుడిగా నియమించేందుకు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. అలాగే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌కు ఫోన్‌ చేసి కొంత కటువుగానే మాట్లాడారనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి మళ్లీ ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ పదవి గురించి పార్టీ పెద్దలతో మాట్లాడటానికే ఢిల్లీ వెళ్లారని సన్నిహితులు చెపుతుండటం గమనార్హం. దీనితో ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. నేతల అభిప్రాయాలను బేరీజు వేసుకుని సోనియా, రాహుల్ గాంధీలు ఏకాభిప్రాయానికి వచ్చి త్వరలో కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.