Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో రెడ్డి పార్టీ!

By:  Tupaki Desk   |   6 Sep 2016 11:57 AM GMT
తెలంగాణ‌లో రెడ్డి పార్టీ!
X
రెండేళ్ల కింద‌ట ఆవిర్భ‌వించిన తెలంగాణ‌లో రెడ్డి సామాజిక వ‌ర్గం కేంద్రంగా ఓ స‌రికొత్త పార్టీ పురుడు పోసుకోనుందా? తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రో కొత్త పార్టీ ఆవిర్భ‌వించ‌నుందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే విన‌బ‌డుతోంది. అయితే, ఆ కొత్త పార్టీని ఎవ‌రు స్థాపించ‌బోతున్నారు? ఎవ‌రి ఆధ్వ‌ర్యంలో నూత‌న పార్టీ ఆవిర్భ‌వించ‌నుంది? అనే ప్ర‌శ్న‌ల‌కు ఇప్పుడిప్పుడే స‌మాధానాలు వ‌స్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్ నేత‌లుగా ఉండి, ప్ర‌స్తుతం పార్టీ కార్య‌క్ర‌మాల‌కు అంటీ ముట్ట‌నట్టు వ్య‌వ‌హ‌రిస్తున్న న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్సే.. త్వ‌ర‌లో రెడ్డి పార్టీ పేరుతో స‌రికొత్త రాజ‌కీయ పార్టీని స్థాపించ‌నున్నార‌నే చ‌ర్చ తెలంగాణ‌లో ఇప్పుడు హాట్ హాట్‌ గా సాగుతోంది. దీంతో ఇప్పుడు అంద‌రి దృష్టీ వీరిపై ప‌డింది.

విష‌యంలోకి వ‌స్తే.. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి - కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డిలు అన్న‌ద‌మ్ములు. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌ గా కాంగ్రెస్‌ లో కొన‌సాగుతున్న వీరికి న‌ల్ల‌గొండ జిల్లాలో మంచి ఫాలోయింగ్ ఉంది. న‌ల్ల‌గొండ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి గ‌డిచిన నాలుగు సార్లుగా గెలుస్తూనే ఉన్నారు. ఇక‌, ఈయ‌న సోద‌రుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే, గ‌డిచిన కొంత కాలంగా వీరు తెలంగాణ కాంగ్రెస్‌ లో అస‌మ్మ‌తి వాదులుగా ఉండ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణ కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని ఉవ్విళ్లూరుతున్న ఈ బ్ర‌ద‌ర్స్‌.. గ‌తంలో టీపీసీసీ చీఫ్‌గా ఉన్న మాజీ మంత్రి పొన్నాల ల‌క్ష్మ‌య్య స‌హా ప్ర‌స్తుత తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డిపై తిరుగుబావుటా కూడా ఎగ‌రేశారు.

ఉత్త‌మ్‌ను ఎలాగైనా పీసీసీ ప‌ద‌వి నుంచి దింపేసి.. త‌మ‌లో ఎవ‌రో ఒక‌రు ఆ పీఠాన్ని ద‌క్కించుకోవాల‌ని ఎంతో ట్రై చేశారు. ఇదే విష‌యంపై నేరుగా కాంగ్రెస్ హై క‌మాండ్‌ తోనూ చ‌ర్చ‌లు జ‌రిపిన కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌.. ఉత్త‌మ్ కుమార్ వ‌ల్ల పార్టీ నాశ‌నం అయిపోతోంద‌ని, జంపింగ్‌ లు పెరిగిపోయాయ‌ని, వాటిని ఆయ‌న క‌ట్ట‌డి చేయ‌లేక‌పోతున్నార‌ని, ప‌రిస్థితి ఇలాగే ఉంటే వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో పార్టీ మ‌రోసారి అధికారాన్ని కోల్పోవ‌డం ఖాయ‌మ‌ని ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో కొన్నాళ్ల కింద‌ట పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న ఉత్త‌మ్‌ ను మారుస్తున్నార‌నే టాక్ భారీగానే వినిపించింది. మ‌రి ఇంత‌లో ఏం జ‌రిగిందో తెలీదుకానీ.. ప్ర‌స్తుతం ఉత్త‌మ్ కొన‌సాగుతున్నారు. అయితే, కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ మాత్రం కాంగ్రెస్ నేత‌ల‌తో క‌ల‌వ‌డం లేదు.

ఇటీవ‌ల మ‌హారాష్ట్రతో తెలంగాణ సీఎం కేసీఆర్ నీటి ఒప్పందాలు చేసుకోవ‌డంపై కాంగ్రెస్ నేత‌లు ఫైట్ చేశారు. ఈ విష‌యంలో ఉత్త‌మ్ కుమార్ జ‌ల‌విధానంపై కేసీఆర్‌ కు అవ‌గాహ‌న లేద‌ని - స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లకు కూడా సిద్ధ‌మ‌య్యారు. ఈ స‌మ‌యంలోనూ కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కాంగ్రెస్ నేత‌ల‌తో క‌లిసిరాలేదు. అదేవిధంగా జిల్లాల విభ‌జ‌న‌కు సంబంధించిన వ్య‌వ‌హారం ముదిరి మాజీ మంత్రి - గ‌ద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ్ దీక్ష చేప‌ట్టారు. దీనికి కాంగ్రెస్‌ లోని జానా రెడ్డి స‌హా చిన్నా పెద్దా అంద‌రూ మ‌ద్ద‌తు ప‌లికారు. చివ‌రికి కామ్రేడ్లు సైతం అరుణ‌కు సంఘీభావం ప్ర‌క‌టించారు. ఈ స‌మ‌యంలోనూ కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ మౌనంగానే ఉన్నారు. దీంతో రెడ్డి బ్ర‌ద‌ర్స్ వ్య‌వ‌హారంపై గుస‌గుస‌లు వినిపించాయి. ఇద్ద‌రు బ్ర‌ద‌ర్సూ కొత్త పార్టీకి శ్రీకారం చుడుతున్నార‌నే వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

త‌మ‌కు విలువ‌లేని పార్టీలో తాము ఎందుకు కొన‌సాగాల‌ని ఇద్ద‌రూ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు కోమ‌టిరెడ్డికి అత్యంత స‌న్నిహితులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నా గుర్తింపు లేద‌ని అన్న‌ట్టు తెలిసింది. ఈ నేప‌థ్యంలోనే బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ రెడ్డి పార్టీ పేరుతో స‌రికొత్త పార్టీకి ప్లాన్ చేస్తున్నార‌ని వెల్ల‌డిస్తున్నారు. గ‌డిచిన ఆరు మాసాలుగా ఇద్ద‌రూ ఇదే ప‌నిపై ఉన్నార‌ని, ఈ నేప‌థ్యంలోనే రెడ్డి సామాజిక వ‌ర్గం స‌హా త‌మ‌తో క‌లిసి వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్న మ‌రో సామాజిక వ‌ర్గంతోనూ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు తెలిసింది. ఇదే గ‌నుక ఒక కొలిక్కి వ‌స్తే.. మ‌రికొద్ది వారాల్లోనే తెలంగాణ‌లో కొత్త పార్టీ ఆవిర్భావం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇక‌,కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌ తో ఎవ‌రెవ‌రు క‌లిసినా.. అంతిమంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలే ప్ర‌మాదం ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు పొలిటిక‌ల్ విశ్లేష‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. వారిని బుజ్జ‌గించేందుకు కాంగ్రెస్ అధిష్టానం చ‌ర్య‌లు తీసుకుంటుందో? లేక కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ పార్టీనే స్థాపిస్తారో మ‌రికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.