Begin typing your search above and press return to search.

చిత్ర‌పురి అధినేత ఎమ్మెల్యే?

By:  Tupaki Desk   |   8 Oct 2018 7:52 AM GMT
చిత్ర‌పురి అధినేత ఎమ్మెల్యే?
X
ఎన్నిక‌ల వేడి అంత‌కంత‌కు హీటెక్కిస్తోంది. ముఖ్యంగా నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు జేగంట మోగ‌డంతో ప్ర‌చార హోరు మొదలైంది. అయితే ఈసారి సినిమావోళ్లు ప్ర‌ధానంగా కంటెస్టెంట్లుగా బ‌రిలో దిగే ఛాన్సుంద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ - బాల‌కృష్ణ‌ - సుమ‌న్ - రోజా - బాబూ మోహ‌న్‌ - విజ‌య‌శాంతి.. ఇలా ఎంద‌రో రాజ‌కీయాల్లో ఉన్నారు.

అయితే స్టార్లు - సూప‌ర్‌ స్టార్లు మాత్ర‌మే కాదు - సినిమా 24 శాఖ‌ల్లో ఉండే కీల‌క వ్య‌క్తులు ఈసారి ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతుండ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిస్తోంది. ముఖ్యంగా ఈసారి ఎల‌క్ష‌న్స్ లో చిత్ర‌పురి కాల‌నీ అధ్యక్షుడు కొమ‌ర వెంక‌టేష్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. ఆ క్ర‌మంలోనే పండ‌గ‌లొస్తే చాలు చిత్ర‌పురి అంతా ఒక‌టే హ‌డావుడి నెల‌కొంటోంది. వినాయ‌క చ‌వితి.. ద‌స‌రా - దీపావ‌ళి పండ‌గ ఏదైనా ఇక్క‌డ సంద‌డే సంద‌డి. కాల‌నీ అంతా రంగుల‌మ‌యంగా తీర్చి దిద్దుతున్నారు. పండ‌గ‌ల‌కు భారీగా సాంస్కృతిక కార్య‌క్ర‌మాలతో హ‌డావుడి చేస్తున్నారు. ఈ వేడుక‌ల‌కు సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని సైతం విచ్చేస్తున్నారు. దాస‌రి ఉన్న‌ప్పుడు ఆయ‌నే ముఖ్య అతిధిగానూ విచ్చేసేవారు.. కానీ ఆయ‌న దివంగ‌తులు అయ్యాక వాతావ‌ర‌ణం పూర్తిగా మారిపోయింది. ఇక్క‌డ జ‌రిగే ఒక్కో కార్య‌క్ర‌మానికి రూ.10ల‌క్ష‌లు పైగా ఖ‌ర్చు చేస్తున్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు క‌మిటీ- కాల‌నీ వాసుల‌ సొమ్ములు ఇలాంటి అన‌వ‌స‌ర‌ హంగామా కోసం ఖ‌ర్చు చేయ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. 24 క్రాఫ్ట్‌ లకు చెందిన వేలాది మంది కార్మికులు కొలువు దీరి ఉండే కాల‌నీ ఇది. అంటే ఆ మేర‌కు ఆ ఓట్లు ఆ నియోజ‌క‌వ‌ర్గాన్నే తీవ్రంగా ప్ర‌భావితం చేసే ఛాన్సుంది.

అందుకే ఈసారి కొమ‌ర వెంక‌టేష్‌ కి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చే ఛాన్సుంద‌న్న చ‌ర్చా సాగుతోంది. చిత్ర‌పురి రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క వ‌ర్గ ప‌రిధిలో ఉంద‌న్న స‌మాచారం తెలుస్తోంది. కొమర వెంక‌టేష్‌ గతంలో కళ్యాణ్ రామ్ హీరోగా `షేర్` అనే చిత్రాన్ని నిర్మించారు. అయితే ఆ సినిమాకు భారీగా నష్టాలు రావ‌డంతో సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటూ ప్రస్తుతం రాజకీయాలపై దృష్టి సారించార‌న్న మాటా వినిపిస్తోంది.