Begin typing your search above and press return to search.

ఎక్సయిజ్ మంత్రి చెప్పిన లాజిక్ రాంగ్

By:  Tupaki Desk   |   6 April 2016 9:50 AM GMT
ఎక్సయిజ్ మంత్రి చెప్పిన లాజిక్ రాంగ్
X
బీహార్ లో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయడం దేశంలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.. అయితే, నవ్యాంధ్రప్రదేశ్ లో మాత్రం సాధ్యం కాదని తేల్చేస్తున్నారు. సాక్షాత్తు ఏపీ అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రే ఈ సంగతి కుండబద్దలు కొట్టి చెప్పేశారు. ఏపీలో మద్య నిషేధం అమలు సాధ్యం కాదని తేల్చేసిన ఆయన అందుకు కారణాలూ చెప్పుకొచ్చారు. ఏపీ పొరుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క దానిలోనూ మద్య నిషేధం అమల్లో లేదని, ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో మద్య నిషేధం అమలు ఇంపాజిబుల్ అని చెప్పేశారు. అయితే, బీహార్ చుట్టూ ఉన్న రాష్ట్రాలన్నిటిల్లో మద్య నిషేధం లేనప్పటికీ అక్కడ అమలు చేస్తున్న విషయాన్ని మంత్రి మరిచిపోయినట్లున్నారు. ప్రస్తుతం గుజరాత్ - నాగాలాండ్ - మిజోరాం రాష్ట్రాల్లో మాత్రమే మద్య నిషేధం ఉంది. ప్రస్తుతం మద్యం నిషేధం అమలు చేస్తున్న నాలుగో రాష్ట్రం బీహార్. దానికి పొరుగున ఉన్న ఉత్తర ప్రదేశ్ - జార్ఖండ్ - పశ్చిమబెంగాల్ లో మద్య నిషేధమేమీ లేదు. అయినా, బీహార్లో అమలు చేస్తున్నారు. ఇదేమీ తెలుసుకోకుండా మంత్రి వ్యాఖ్యానించారా లేదంటే, యథాలాపంగా అన్నారా అన్నది తెలియాల్సి ఉంది.

మరోవైపు నారా లోకేశ్ కు మంత్రి పదవి ఇవ్వాలంటూ మంత్రి కొల్లు నేతృత్వంలో తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అండగా నారా లోకేశ్‌ కు బాధ్యతలు అవసరమని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయవాడ టీడీపీ కార్యాలయంలో కృష్ణా బీసీ సెల్‌ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ సంగతి చెప్పడంతో పాటు లోకేశ్‌ కు మంత్రి పదవి ఇవ్వాలని సమావేశంలో తీర్మానం చేశారు. లోకేశ్ బీసీలకు అండగా నిలచే నాయకుడని... నాడు ఎన్టీఆర్‌ కు అండగా చంద్రబాబు యువనాయకత్వం ఎంతో పనిచేసిందని.. ఇప్పుడు చంద్రబాబుకు అండగా లోకేశ్ నాయకత్వం తోడుగా ఉండాలన్నారు. బీసీలంతా లోకేశ్‌ మంత్రి పదవి చేపట్టాలని కోరుకుంటున్నారని తెలిపారు.