Begin typing your search above and press return to search.

పాంటింగ్ జట్టులో కోహ్లి.. చోటివ్వని కోచ్ కటిచ్.. ఫాబ్ 5లో వారు

By:  Tupaki Desk   |   8 Jan 2022 12:30 PM GMT
పాంటింగ్ జట్టులో కోహ్లి.. చోటివ్వని కోచ్ కటిచ్.. ఫాబ్ 5లో వారు
X
ప్రస్తుతం టెస్టు క్రికెట్ లో టాప్ క్లాస్ బ్యాట్స్ మన్ ఎవరంటే.. నిస్సందేహంగా చెప్పే పేర్లు విరాట్ కోహ్లి, జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్. ఏ మాజీ దిగ్గజం తమ కలల జట్టును ఎంపిక చేసినా.. వీరికి చోటు లేకుండా ఉండదు. వాస్తవానికి వీరు నలుగురూ టాప్ క్లాస్ వారే. దేనిలోనూ ఎవరూ ఎవరికీ తగ్గరు. బహుశా.. వేర్వేరు జట్ల బ్యాట్స్ మన్ నలుగురు ఒకే తరంలో ఇంతటి పేరు ప్రఖ్యాతులు పొందడం ఇదే తొలిసారి అనుకుంటా. అయితే, వీరిలోరూట్ ఒక్కడే టి20లు ఆడడం లేదు. కానీ స్థాయిలో మాత్రం తక్కువేం కాదు.

టాప్-5 టెస్ట్ బ్యాట్స్‌మెన్‌.. భారత్ నుంచి ఒక్కడే! రోహిత్ శర్మకు నో చాన్స్! కాగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ తరం టాప్-5 టెస్ట్ బ్యాట్స్‌మన్‌ను ఎంపిక చేశాడు. ప్రతిష్టాత్మ యాషెస్ సిరీస్ సందర్భంగా సహచర ఆటగాడు, మాజీ కోచ్ సైమన్ కటిచ్‌తో కలిసి అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్‌మన్‌ను ఎంచుకున్నారు. ఈ లిస్ట్‌లో నలుగురి ఆటగాళ్లపై ఈ ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాగా.. ఒక్క ఆటగాడి విషయంలో మాత్రం భేదాభిప్రాయాలు వచ్చాయి. అది కూడా టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ విషయంలోనే. రికీ పాంటింగ్ తన టాప్-5 బ్యాట్స్‌మన్ లిస్ట్ విరాట్ కోహ్లీకి చోటివ్వగా.. సైమన్ కటిచ్ మాత్రం రోహిత్ శర్మను ఎంచుకున్నాడు.

ఫాబ్-4 కాదు.. ఫాబ్-5.. చివరన కోహ్లి ఈ తరం క్రికెట్‌లో ఫాబ్యులస్ -4‌గా భావించే విరాట్ కోహ్లీ, జో రూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్‌లను తన అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా ప్రకటించిన పాంటింగ్ ఈ లిస్ట్‌లో మార్నస్ లబుషేన్‌ను జత చేసి దానిని ఫాబ్-5చేశాడు. అయితే, జాబితాలో రూట్‌ను నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా ప్రకటించాడు. నయా సంచలనం లుబుషేన్‌కు రెండో , విలియమ్సన్‌కు మూడో ర్యాంక్ ఇచ్చాడు. స్మిత్‌ను నాలుగో స్థానంలో ఎంపిక చేసిన పాంటింగ్.. విరాట్ కోహ్లీకి ఐదో స్థానం కేటాయించాడు.

విస్మరించిన కటిచ్ సైమన్ కటిచ్ టాప్-5 బ్యాట్స్‌మన్‌లో కోహ్లీకి చోటివ్వలేదు. విరాట్‌కు బదులు రోహిత్ శర్మను ఎంపిక చేశాడు. అంతేకాకుండా అతడిని నాలుగో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా పేర్కొన్నాడు. లబుషేన్‌కు మొదటి ర్యాంక్ ఇవ్వడం విశేషం. రూట్, విలియమ్సన్‌లను రెండు, మూడో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లుగా ఎంపిక చేశాడు. స్మిత్‌కు ఐదో స్థానం కేటాయించాడు.

ఏడాదిలో ఎంత మార్పు?

ఏడాది క్రితం వరకు టెస్టు జట్టులో రోహిత్ శర్మకు స్థానమే లేదు. అయితే, ఇప్పడు అతడే ఫస్ట్ చాయిస్ ఓపెనర్. ఇక గతేడాది వరకు టాప్ 4 బ్యాట్స్ మన్ లో కోహ్లి ఖాయంగా ఉండేవాడు. అతడు సెంచరీ చేయక రెండేళ్లయింది. అర్ధ సెంచరీలు కూడా కొట్టలేని స్థితిలో ఉన్నాడిప్పడు. అందుకే.. కొందరి డ్రీమ్ టీమ్ నుంచి మిస్ అవుతున్నాడు. రోహిత్ మాత్రం ముందడగేస్తూ వెళ్తున్నాడు. మరోవైపు ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కోచ్‌గా వ్యవహరించిన కటీచ్.. కోహ్లీని కాదని రోహిత్‌ను ఎంచుకోవడం గమనార్హం. ఐపీఎల్ 2021 ఫస్టాఫ్ వరకు ఆర్‌సీబీకి హెడ్ కోచ్‌గా కొనసాగిన కటీచ్.. సెకండాఫ్ ముందు తప్పుకున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అసిస్టెంట్ కోచ్‌గా సేవలందించనున్నాడు.

పాంటింగ్ టాప్-5 బ్యాట్స్‌మన్
1. జోరూట్,
2. మార్నస్ లబుషేన్
3. కేన్ విలియమ్సన్
4. స్టీవ్ స్మిత్
5. విరాట్ కోహ్లీ

కటీచ్ టాప్-5 బ్యాట్స్‌మన్
1. మార్నస్ లబుషేన్
2. జోరూట్
3. కేన్ విలియమ్సన్
4. రోహిత్ శర్మ
5. స్టీవ్ స్మిత్