Begin typing your search above and press return to search.

రాహుల్ హత్య : కోగంటి సత్యం రిమాండ్ రిపోర్ట్ లో ఏం చెప్పాడంటే?

By:  Tupaki Desk   |   26 Aug 2021 12:00 PM IST
రాహుల్ హత్య : కోగంటి సత్యం రిమాండ్ రిపోర్ట్ లో ఏం చెప్పాడంటే?
X
విజయవాడ యువ వ్యాపారవేత్త రాహుల్ హత్య కేసులో రోజులు గడిచే కొద్ది అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కంపెనీల షేర్ల వివాదమే.. రాహుల్‌ హత్య కారణమని పోలీసులు తమ విచారణలో బయటపెట్టారు. హత్య తర్వాత కోరాడ విజయ్‌ కు బంధువుల ఆశ్రయం ఇచ్చారు. రాహుల్‌ ఫోన్లు కొరడా విజయ్‌ దగ్గర పోలీసులు గుర్తించారు. కోరాడ విజయ్‌కుమార్‌తోపాటు కారుడ్రైవర్‌ పాత్ర ఉన్నట్లు పోలీసులు తేల్చారు. రాహుల్ మర్డర్ కేసులో తొలి నుంచి కోగంటి సత్యం పేరు ప్రధానంగా వినిపించింది. రాహుల్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదులోనూ కోగంటి పేరును చేర్చారు. రాహుల్ మర్డర్‌కు ప్లాన్ వేసింది, దాన్ని పక్కాగా అమలు చేసింది కోగంటేనన్న మాట వినిపించింది.

రాహుల్ కంపెనీలోనే లేని కోగంటి ఎందుకు ఇన్వాల్స్ అయ్యాడనే కోణం దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు మైండ్ బ్లాంకయ్యే నిజాలు తెలిశాయి. అసలు కుట్రదారుడే కోగంటిగా గుర్తించి అతని కోసం వేట మొదలుపెట్టారు. అప్పటివరకు బెజవాడలోనే ఉన్న కోగంటి, పోలీసులు తన కోసం వస్తున్నారని తెలుసుకుని, పారిపోయేందుకు ప్రయత్నాలు చేసాడు. ఈ నెల 19వ తేదీన రాహుల్ మర్డర్ జరిగితే, 22వరకు బెజవాడలోనే ఉన్నాడు. నాలుగు రోజులపాటు ఇంట్లోనే ఉంటూ తన కార్యకలాపాలు కొనసాగించాడు. ఎప్పుడైతే పోలీసులు తన కోసం వస్తున్నారని తెలుసుకున్నాడో ఈ నెల 23న బెంగళూరు పారిపోయాడు. అక్కడ నుంచి విదేశాలకు వెళ్లిపోవాలని ప్లాన్ వేసుకున్నాడు.

కానీ,విజయవాడ పోలీసులు, కోగంటి కంటే వేగంగా స్కెచ్ వేశారు. ఈ-మెయిల్ ద్వారా బెంగళూరు ఎయిర్ పోర్ట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చిక్కిపోయాడు. బెంగళూరు ఎయిర్ పోర్టులో అక్కడి పోలీసులు కోగంటిని అరెస్ట్ చేశారు. అక్కడ్నుంచి ట్రాన్సిట్ వారెంట్ పై కోగంటిని విజయవాడ తరలించిన ఏపీ పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కి తరలించారు. కోగంటి సత్యం రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు. రిమాండ్ రిపోర్ట్‌లో కోగంటి పాత్రను క్లియర్‌గా ప్రస్తావించారు పోలీసులు. రాహుల్ మర్డర్ కేసులో కోగంటిని ఏ4గా చేర్చిన పోలీసులు, ప్రధాన నిందితుడు ఏ1 కోరాడ విజయ్ తో కలిసి రాహుల్ మర్డర్ కు కుట్ర పన్నినట్లు తెలిపారు. ఇప్పటికే కోగంటి సత్యంపై మొత్తం 24 క్రిమినల్ కేసులు ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

ఇక, మెడికల్ సీటు ఇప్పిస్తానని గాయత్రి వద్ద రాహుల్ రూ.6 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. మెడికల్ సీటు ఇప్పించకపోవడంతో తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని గాయత్రి. రాహుల్‌ పై ఒత్తిడి తెచ్చింది. రాహుల్ తండ్రి రాఘవరావు తొలుత రూ.50 లక్షలు ఇస్తామని గాయత్రికి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ నెల 18వ తేదీన రాత్రి 7.30 నిమిషాలకు గాయత్రి, రాహుల్‌ కు ఫోన్ చేయగా, ఒక్కడే కారులో బయటకు వెళ్లాడు. ఆమె మాట్లాడిన తర్వాత రాహుల్ కారులో కోరాడ విజయ్, సీతయ్య, బాబూరావు ఎక్కారు. డబ్బులు తెచ్చావా..? అని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. కారులో ఉన్న సీతయ్య అనే వ్యక్తి రాహుల్ మెడకు వైరు బిగించగా.. బాబూరావు దిండుతో మొహాన్ని అదిపట్టుకున్నాడు. దీంతో అక్కడికక్కడే రాహుల్ మృతి చెందాడు. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

ఆ రోజు రాత్రంతా రాహుల్ ఇంటికి రాకపోవడంతో తర్వాతి రోజు ఉదయం అతడి తండ్రి రాఘవరావు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుణదల వద్ద కారులో గుర్తుతెలియని శవం ఉన్నట్లు సమాచారం అందింది. అది రాహుల్ మృతదేహంగా గుర్తించి పోస్ట్‌మార్టంకు తరలించారు. హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాహుల్‌ను ఎలా హతమార్చాలి.? ఎవరిని రంగంలోకి దించాలి. హత్య తర్వాత ఎలా వ్యవహరించాలి. పోలీసులకు అనుమానం రాకుండా ఎలా ఉండాలనేదానిపై కోగంటి సత్యం నిందితులకు ట్రైనింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. హత్య తర్వాత పేరు బయటకు వస్తే ఎలా లొంగిపోవాలనేది కూడా కోరాడ విజయ్ కుమార్ కు కోగంటి సత్యమే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది

రాహుల్ తండ్రి రాఘవరావు ఫిర్యాదు మేరకు ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా కోరాడ విజయ్‌కుమార్, ఏ2గా కోగంటి సత్యం పేర్లు చేర్చారు. ముగ్గురు మహిళల ప్రేమేయం కూడా రాహుల్ హత్యలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ హత్యతో పాత్రధారులుగా భావిస్తున్న పద్మజ అనే పేరుతో ఉన్న ఇద్దరు మహిళల పేర్లను కూడా ఏ3, ఏ4గా చేర్చారు. కోగంటి సత్యం ద్వారా ఫ్యాక్టరీ కొనుగోలుకు చర్చలు జరిగాయని, తన వాటా డబ్బుల కోసం కోరాడ విజయ్‌కుమార్ అనేకసార్లు ఒత్తిడి తెచ్చారని రాహుల్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాహుల్‌ కు చెందిన జిక్సిన్ కంపెనీని తక్కువ ధరకే కొట్టేయాలని నిందితులు స్కెచ్ వేసినట్లు డ్రైవర్ బాబు పోలీసులకు తెలిపాడు. ఇదే అంశంలో గత ఏడాది కాలంగా కోరాడ విజయ్. రాహుల్ పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడు. రూ. 15 కోట్లు విలువ చేసే జిక్సిన్ కంపెనీ30 శాతం వాటాను వెనక్కి ఇవ్వాలన్ని కోరాడు విజయ్. ఇందుకోసం రాహుల్‌ పై ఒత్తిడి తీసుకువచ్చాడు. డబ్బుల కోసం రాహుల్‌ ను ఇబ్బందులకు గురి చేశాడు. మరోవైపు విజయ్ వాటాను కొనేందుకు కోగంటి సత్యం ప్రయత్నించాడు. అతనికి కంపెనీలో షేర్ ఇచ్చేందుకు రాహుల్ నిరాకరించాడు. దాంతో రాహుల్‌ ను హత్య చేయాలని స్కెచ్ వేశారు.