Begin typing your search above and press return to search.

కోడెల వారసుడుకు క్లారిటీ ఇవ్వలేదా...?

By:  Tupaki Desk   |   6 Jan 2022 12:30 AM GMT
కోడెల వారసుడుకు క్లారిటీ ఇవ్వలేదా...?
X
నెక్స్ట్ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నిదానంగా పావులు కదుపుతున్నారు. ఎక్కడకక్కడ వైసీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలకు ధీటుగా బలమైన టీడీపీ నేతలని ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులని బరిలో దించడానికి సిద్ధమవుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్ధులని కూడా మార్చేశారు.

అయితే ఇలా పలుచోట్ల అభ్యర్ధుల్లో మార్పులు చేసుకుంటూ వస్తున్న బాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లి విషయంలో మాత్రం ఇప్పటికీ క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక్కడ సీటు ఎవరికి ఫిక్స్ చేయడం లేదు. ఓ వైపు కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం...మరోవైపు రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావులు సత్తెనపల్లి సీటు కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. కానీ సత్తెనపల్లి సీటు అనేది కోడెల వారసుడుకే కేటాయిస్తారనే టాక్ ఎప్పటినుంచో నడుస్తోంది.

ఎందుకంటే 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ కోడెల శివప్రసాద్ పోటీ చేశారు. 2014లో గెలవగా, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయాక కోడెల పలు కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కోడెల చనిపోయాక సత్తెనపల్లిని ఎవరికి కేటాయించలేదు. కాకపోతే కోడెల తనయుడు శివరాం..నియోజకవర్గంలో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. కానీ నియోజకవర్గంలో ఉన్న కొందరు టీడీపీ శ్రేణులు శివరాంని వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో రాయపాటి వారసుడు రంగారావు కూడా సత్తెనపల్లి సీటు కోసం రెండు, మూడు సార్లు చంద్రబాబుని కూడా కలిశారు. కానీ చంద్రబాబు ఎవరికి ఫిక్స్ చేయలేదు.

అయితే రాయపాటి ఫ్యామిలీకి ఎలాగో నరసారావుపేట పార్లమెంట్ సీటు రిజర్వ్ చేశారు...మళ్ళీ ఇంకో సీటు ఇస్తారో లేదో చెప్పలేని పరిస్తితి. కానీ కోడెల ఫ్యామిలీకి సీటు ఇవ్వకపోతే ఆ ప్రభావం టీడీపీపై ఎక్కువ పడుతుంది. నరసారావుపేట అసెంబ్లీలో ఎలాగో చదలవాడ అరవింద‌బాబు ఉన్నారు. కాబట్టి అక్కడకు మళ్ళీ పంపలేరు. కాబట్టి సత్తెనపల్లి సీటు శివరాంకే కేటాయించాల్సి ఉంటుంది. కాకపోతే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే వ‌ర‌కు శివ‌రాంకు టెన్ష‌న్ త‌ప్ప‌దు.