Begin typing your search above and press return to search.

రాష్ట్ర విభ‌జ‌న గురించి కోడెల మాట‌లు విన్నారా?

By:  Tupaki Desk   |   23 Sep 2016 6:51 PM GMT
రాష్ట్ర విభ‌జ‌న  గురించి కోడెల మాట‌లు విన్నారా?
X
ఏపీ శాస‌న స‌భాప‌తి డాక్ట‌ర్ కోడెల శివ‌ప్ర‌సాదరావు ఇటీవ‌ల పెద్ద ఎత్తున్నే విదేశీ ప‌ర్య‌ట‌నలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌వాసాంధ్రుల‌లో ఉత్తేజం నింపేందుకు ఆయ‌న ఆస‌క్తిక‌రంగా ప్ర‌సంగిస్తున్నారు. ఇటీవ‌ల అమెరికా ప‌ర్య‌ట‌న చేసిన స్పీక‌ర్ కోడెల తాజాగా జ‌పాన్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగ‌స్వాములు కావాలంటూ టోకియో. హిరోషిమాల‌లోని ప్ర‌వాసాంద్రుల‌కు విన్న‌విస్తూ, వారికి న‌మ్మిక క‌లిగిస్తూ వారిని ఉత్తేజ ప‌రిచేలా ప్ర‌సంగాలు చేస్తూ త‌నదైన శైలిలో ముంద‌డుగు వేస్తున్నారు. జ‌పాన్ తెలుగు సంఘాల ఆహ్వానం మేర‌కు గ‌త నాలుగు రోజులుగా అక్క‌డ ప‌ర్య‌టిస్తున్న కోడెల ఆయా స‌భ‌ల‌లో అన్ని విష‌యాల‌ను కూలంక‌షంగా వివ‌రిస్తూ వ‌స్తున్నారు.

కేంద్రంలో నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అవమానకరమైన ధోరణిలో రాష్ట్రాన్ని నిర్దాక్షిణ్యంగా విడగొట్టిందని కోడెల మండిప‌డ్డారు. నవ్యాంధ్ర అభివృద్ధికి అవసరమైన నిధులు లేకున్నా ఆ రాష్ట్రాన్ని అన్ని పరిస్థితుల్లో ముందుకు నడిపించగలిగిన దమ్ము, ధైర్యం ఉన్న చంద్ర‌బాబు నాయకత్వం ఏపీకి ఉందని కోడెల‌ శివప్రసాద్ గుర్తు చేశారు. అన్ని విధాలా వనరులు ఉన్న అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం ఆయన పరిపాలనాదక్షతకు నిదర్శనమని కోడెల అన్నారు. చాలా మంది యువతీయువకులు విదేశాలకు వెళ్లి మంచి రంగాల్లో స్థిరపడ్డారని వారు నవ్యాంధ్ర నవ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించాలని, తమకు జన్మనిచ్చిన గ్రామాల అభివృద్దికి స‌హ‌క‌రించాల‌ని కోరారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా సొంత కాళ్లపై నిలబడే సత్తా తెలుగువారికి ఉంద‌ని నిరూపించుకోవ‌ల‌సిన త‌రుణం ఆస‌న్న‌మైంద‌ని కోడెల‌ స్ప‌ష్టం చేసారు.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా అపారమైన సహజసంపద నవ్యాంధ్రలో ఉందని ప్రవాసాంధ్రులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి తరుణమని కోడెల‌ పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టేవారికి రాష్ట్రంలో సింగిల్ విండో విధానం ద్వారా అన్ని అనుమతులు సులభంగా లభిస్తున్నాయని తెలిపారు. ఏపీకి ఉన్న విశాల‌మైన కోస్తా తీరం, వ‌న‌రులు వ్యాపార వాణిజ్య రంగాల‌కు బ‌ల‌మైన పునాదులుగా ఉన్నాయ‌న్నారు. ప్రస్తుతం దేశంలో పెట్టుబ‌డుల‌కు అనుకూల‌మైన రాష్ట్రాల జాబితాలో ఏపీకి రెండ‌వ స్ధానం ద‌క్కింద‌ని, ఇది స్వ‌యంగా ప్ర‌పంచ బ్యాంకు ఇచ్చిన ర్యాంకింగ్ అని కోడెల గుర్తు చేసారు. రానున్న 15 సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధిలో ఎపి ప్ర‌తిష్టాత్మ‌క రాష్ట్రంగా రూపుదిద్దు కోనుంద‌ని, బాలారిష్టాలను అధిక‌మించేందుకు ప్ర‌వాసాంధ్రుల స‌హ‌కారం అత్యావ‌శ్య‌క‌మ‌ని డాక్ట‌ర్ కోడెల స్ప‌ష్టం చేసారు. మ‌రోవైపు జ‌పాన్ బ్యాంక్ అధికారులు సైతం న‌వ్యాంధ్ర నిర్మాణంలో భాగ‌స్వామ్యానికి ఆస‌క్తి వ్య‌క్తం చేయ‌గా, అక్క‌డి రాయ‌బార కార్యాల‌య అధికారుల‌ను స‌మ‌న్వ‌య ప‌ర‌చాల‌ని స‌భాప‌తి సూచించారు.