Begin typing your search above and press return to search.

స్పీకర్ కోడెల రికార్డు సృష్టించారు

By:  Tupaki Desk   |   22 Feb 2016 11:37 AM GMT
స్పీకర్ కోడెల రికార్డు సృష్టించారు
X
బహిరంగ మల విసర్జన అనేది భారతదేశంలో ఉన్న అతిపెద్ద దురలవాటు. ఇక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితులు దానికి కారణమైనప్పటికీ ప్రపంచమంతా అభివృద్ధి బాట పడుతున్న తరుణంలోనూ ఇది ఇంకా భారత్ ను వీడలేదు. ఇది ఏకంగా ప్రజారోగ్యానికే సవాల్ విసురుతోంది. మోడీ గవర్నమెంటు తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో పరిస్థితులు మారుతున్నా ఇంకా పూర్తిస్థాయిలో మార్పు రాలేదు. కొన్ని మారుమూల గ్రామాల్లో మ‌రుగుదొడ్లు లేనే లేవు. ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలో అంద‌రూ మ‌రుగుదొడ్డి నిర్మించుకునేందుకు కేంద్రం నిధులు విడుద‌ల చేసింది. నిర్మాణాలు కూడా చేప‌ట్టారు. ఈ నిర్మాణాల్లో ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్రసాద‌రావు నియోజ‌క‌వ‌ర్గం స‌త్తెన‌ప‌ల్లి అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.

వంద‌శాతం మ‌రుగుదొడ్ల నిర్మాణంతో రాష్ట్రంలో పేరు ప్ర‌ఖ్యాతులు గ‌డించిన గుంటూరు జిల్లా స‌త్తెనప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల‌లో న‌మోదు అయ్యింది. ఈ మేర‌కు ఆ సంస్ధ సందేశం పంపింది. వంద రోజుల వ్యవ‌ధిలో ఒక శాస‌న‌స‌భ్యుడి నియోజ‌క‌వ‌ర్గంలో గ‌రిష్టంగా మ‌రుగుదొడ్లను నిర్మించ‌ట‌మే కాకుండా, నియోజ‌క‌వ‌ర్గంలోని ప్రతి కుటుంబం మ‌రుగుదొడ్డిని క‌లిగి ఉండేలా ఏర్పాట్లు చేసినందుకుగాను ఈ రికార్డును న‌మోదు చేస్తున్నట్లు లిమ్కాబుక్ ఆప్ రికార్డ్స్ బులెటిన్‌లో పేర్కొంది. ఏపీ శాసన స‌భాప‌తి కోడెల శివ‌ప్రసాద‌రావు స‌త్తెన‌ప‌ల్లికి ప్రాతినిధ్యం వ‌హిస్తూ వంద శాతం మ‌ర‌గుదొడ్ల నిర్మాణానికి కృషి చేసి విజ‌య‌వంతం చేశారు, ఒక ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గంలో ఇన్ని మ‌రుగుదొడ్లు నిర్మించ‌డ‌మంటే.. రికార్డే క‌దా! ఈ విష‌యంలో కోడెల‌ను మెచ్చుకోవాల్సిందే.