Begin typing your search above and press return to search.

ఎందుకొచ్చిన కమిటీలు స్పీకర్ గారూ..

By:  Tupaki Desk   |   25 Dec 2015 1:30 PM GMT
ఎందుకొచ్చిన కమిటీలు స్పీకర్ గారూ..
X
నవ్యాంధ్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చోటు చేసుకొన్న పరిణామాలపై విచారణకు ప్రత్యేక కమిటీని వేస్తామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. సభలో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన దృశ్యాలు ముందుగా సామాజిక మాధ్యమంలో రావడంపైనా విచారణ జరుపుతామని ప్రకటించారు. ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందులో టీడీపీ - బీజేపీ - వైసీపీ నుంచి ఒక్కొక్కరు ఉంటారని కూడా వెల్లడించారు.

శాసనసభలో ఉన్నది రెండే రెండు వర్గాలు. మూడే మూడు పార్టీలు. టీడీపీ, బీజేపీ కలిసి అధికారంలో ఉన్నాయి. ప్రతిపక్షంగా ఉన్నది వైసీపీ. బీజేపీకి ఉన్న నలుగురు సభ్యులనూ పక్కనపెడితే సభలో మిగిలింది టీడీపీ, వైసీపీ. అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు అన్నటికీ బాధ్యులు ఈ రెండు పార్టీ నాయకులే. రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాలు, ఎత్తులు పైయెత్తుల్లో భాగంగా ఒకరిని మరొకరు రెచ్చగొట్టుకున్నారు. కాల్ మనీ వ్యవహారాన్ని పక్కన పెట్టడమే ధ్యేయంగా వైసీపీ నేతలను ఉద్దేశించి అచ్చెన్నాయుడు, బోండా ఉమా తదితరులు విమర్శిస్తే.. చంద్రబాబు సహా టీడీపీ నేతలను ఉద్దేశించి వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఆ తర్వాత వైసీపీని ఇరుకున పెట్టడమే ధ్యేయంగా అసెంబ్లీ సీడీలను బయటకు విడుదల చేశారు. వాటి విడుదలకు స్పీకర్ ఆమోదం ఉందని తొలుత చెప్పి.. ఆ తర్వాత మాట మార్చారు. స్పీకర్ అనుమతి లేకుండానే విడుదల చేశామని చెప్పారు.

అసెంబ్లీ పరువు తీసింది టీడీపీ, వైసీపీలు ఉమ్మడిగా. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పరమ పవిత్రమైన అసెంబ్లీని బూతుల వేదికగా మార్చారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలతోనే సభ్యులను వేసి.. కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేసి సమీక్షిస్తామనడం ఎవరిని నమ్మించడానికని హక్కుల సంఘాల నేతలు, ప్రజాస్వామ్య వాదులు ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగాన్ని అగ్గిపుల్ల గీసి తగలబెట్టిన వాళ్లే మళ్లీ దాన్ని రాస్తారని అన్నట్లు ఉందని ఎద్దేవా చేస్తున్నారు.