Begin typing your search above and press return to search.

కలప దొంగల మీద కోడెల హీరోయిజం

By:  Tupaki Desk   |   8 July 2016 8:31 AM GMT
కలప దొంగల మీద కోడెల హీరోయిజం
X
ఈ మధ్య కాలంలో విమర్శలతో..ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తాజాగా అందుకు భిన్నమైన రీతిలో వార్తల్లోకి వచ్చారు. ఈ మధ్యన ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు వివాదాస్పదంగా మారటం తెలిసిందే. తన మీద చేస్తున్న ఆరోపణల విషయంలో ఇప్పటికే క్లారిటీ ఇచ్చినప్పటికి ప్రశ్నించే వారు మాత్రం ఆయన్ను ప్రశ్నించే పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన తన హీరోయిజాన్ని ప్రదర్శించారు.

తాజాగా ఆయన గుంటూరు జిల్లా ఫిరంగిపురం – నరసరావుపేట మార్గంలో ప్రయాణిస్తున్నారు. దారిన పెద్ద ఎత్తున చెట్లు కొట్టేసి ఉండటాన్ని గుర్తించారు. ఈ నరికవేత మొత్తం అక్రమంగా కలపను దోచుకోవటానికే అన్న విషయాన్ని గుర్తించిన కోడెల వెంటనే స్పందించారు. తాను ప్రయాణిస్తున్న కారును నిలిపివేసి.. భారీ వృక్షాల్ని నరికివేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. వారిని స్వయంగా ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో అప్పగించారు.

మొక్కల్ని నాటటంపై దృష్టి పెడుతున్న అధికారులు.. చెట్లను కాపాడే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలంటూ క్లాస్ పీకిన ఆయన.. అటవీ శాఖాధికారులు.. ఆర్ అండ్ బీ అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని కింది స్థాయి సిబ్బంది అక్రమాల బాట పట్టటంతో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని.. అలాంటి వారి పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ స్పీకర్ గా కోడెల చేసిన తాజా ప్రయత్నాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. మొక్కలు నాటే విషయం మీద చూపించే శ్రద్ధ.. చెట్లను నరికేసే వారి విషయంలోనూ అలెర్ట్ గా ఉండాల్సిన అవసరాన్ని కోడెల తన తాజా చర్యతో స్పష్టం చేశారని చెప్పాలి.