Begin typing your search above and press return to search.

ఆనం బ్రదర్స్ తరువాత ఆయనేనా?

By:  Tupaki Desk   |   5 Dec 2015 5:54 AM GMT
ఆనం బ్రదర్స్ తరువాత ఆయనేనా?
X
తెలంగాణలో కేసీఆర్ ప్లే చేస్తున్న మాగ్నటిక్ పాలిటిక్స్ చూసి ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్ఫూర్తి పొందుతున్నట్లుగా ఉంది. బద్ధ శత్రువులను కూడా అక్కున చేర్చుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నెల్లూరులో ఆనం సోదరులను పార్టీలో చేర్చుకున్న ఆయన మిగిలిన జిల్లాల్లోనూ పనికొచ్చే నేతలను పార్టీలోకి లాగేయాలంటూ ఆయా జిల్లాల నేతలకు పురమాయిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయా నేతలతో చిరకాల విరోధం ఉన్న టీడీపీ నేతలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక మెట్టు దిగి వారితో మంతనాలు సాగిస్తున్నారు. ఆనం సోదరుల రాకను నెల్లూరు టీడీపీ నేతలు ఎంతగా వ్యతిరేకించినా కూడా చంద్రబాబు వినలేదు... ఎవరొచ్చినా సర్దుకుపోవాల్సిందేనని తేల్చిచెప్పేశారు. మిగతా జిల్లాల్లోనూ అదే సూత్రం పాటించాలని ఆయన అనుకుంటుండడంతో ఆయా జిల్లాల కీలక నేతలు కిమ్మనకుండా అధినేత ఆదేశాలను పాటిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో స్పీకర్ కోడెల శివప్రసాద్ అక్కడ తన రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ నేత కాసు కృష్ణారెడ్డితో భేటీ కావడం ఇలాంటిదేనని అంటున్నారు.

నర్సారావుపేట మున్సిపాలిటీ శతాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించేందుకు స్పీకర్ కోడెల - ఎంపీ రాయపాటి సాంబశివరావులు కలిసికట్టుగా కాసు కృష్ణారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో గంటకు పైగా సమావేశమయ్యారు. పైకి ఇది సాధారణ సమావేశంగా కనిపిస్తున్నా ఇందులో పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయని గుంటూరు పొలిటికల్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. కాసు కృష్టారెడ్డి 2014 ఎన్నికల్లో పోటీ చేసిన పరాజయం పాలయ్యారు. ఆనం సోదరులను చేర్చుకున్నట్లే ఆయన్నూ చేర్చుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని.. ఆ బాధ్యతను ఎంపీ రాయపాటి - కోడెలకు అప్పగించారని సమాచారం. మరి వారి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో.. కాసు సైకిలెక్కుతారో లేదో చూడాలి.