Begin typing your search above and press return to search.

రేవంత్‌ కు దెబ్బ‌ప‌డింది

By:  Tupaki Desk   |   29 Aug 2015 11:15 AM IST
రేవంత్‌ కు దెబ్బ‌ప‌డింది
X
తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుండ‌టంతో తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. పాలమూరు జిల్లా కొడంగల్, వనపర్తి నియోజకవర్గాలను టార్గెట్ చేసిన అధికార పార్టీ సక్సెస్ రూట్ లో నడుస్తోంది. ఆ రెండు నియోజకవర్గాల నుంచి ఇద్దరు ఎంపీపీలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఐక్యంగా ఉండి...సీఎం కేసీఆర్‌ కు అండగా నిలవాలని పిలుపునిచ్చిన గులాబీనేతలు.. ప్రభుత్వ పథకాలను సమర్థిస్తూనే, ప్రతిపక్షాలను ఎండగట్టారు.

తాజాగా రేవంత్ రెడ్డి నియోజక వర్గమైన కొడంగల్ ఎంపీపీ దయాకర్ రెడ్డి టీఆర్ ఎస్‌ లో చేరారు. దయాకర్ రెడ్డితో పాటు ప‌లువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ర్ట వైద్యారోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యాక్షుడు నిరంజన్ రెడ్డి వీరందరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ పాలనలో పాలమూరు జిల్లా వెనకేయబడిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఇప్పుడు అందరం కలిసి బంగారు తెలంగాణను పుననిర్మించుకోవాలని టీఆర్ ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.