Begin typing your search above and press return to search.

ఇదే నిద‌ర్శ‌నం..బీజేపీతో కోదండ‌రాం

By:  Tupaki Desk   |   28 Sep 2018 8:07 PM GMT
ఇదే నిద‌ర్శ‌నం..బీజేపీతో కోదండ‌రాం
X
తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రో హాట్ హాట్ ప‌రిణామం చోటుచేసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అప‌ద్ధ‌ర్మ స‌ర్కారుకు నేతృత్వం వ‌హిస్తున్న టీఆర్ ఎస్ పార్టీని ఎదుర్కునేందుకు మ‌హాకూట‌మి పేరుతో జ‌ట్టుక‌ట్టిన కాంగ్రెస్‌-టీడీపీ-సీపీఐ-జ‌న‌సేన కూట‌మిలో తెలంగానణ జ‌న‌స‌మితి త‌న దారి తాను చూసుకోనుంద‌ని అంటున్నారు. అంతేకాకుండా బీజేపీతో పొత్తు కుదుర్చుకునేంద‌కు ఇప్ప‌టికే చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయ‌నేది కొంద‌రి మాట‌. మహా కూటమిలో చేరే అంశంపై ఆ పార్టీ నేతలు ఇంకా సందిగ్థంలోనే ఉన్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో టీజేఎస్‌ తమ పార్టీతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో సగం సీట్లు కేటాయించటమే కాక కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని కూడా ఆయన సారధ్యంలోనే ముందుకు తీసుకు పోతామని బీజేపీ నేతలు ఇచ్చిన బంపర్‌ ఆఫర్‌ రాష్ట్రంలో రాజకీయ దుమారం లేపుతున్నది. ఈ ప్రతిపాదనపై కోదండరాం సానుకూలంగా స్పందిస్తారని బీజేపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ పునర్నిర్మాణం - ఆమర వీరుల ఆశయ సాధన కోసం అవసరమైన ఒక ప్రత్యేక ఎజెండాను తయారు చేసుకున్న కోదండరాం ఇది అమలు చేయటం కోసమే కూటమిలో చేరాలనుకుంటున్నట్టు ప్రజలకు ఇప్పటికే సంకేతాలు పంపారు. అయితే విధానపరమైన ఈ అంశంపైనే కాంగ్రెస్‌ నేతలు -అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. టీఆర్ ఎస్‌ ను ఎదుర్కునేందుకు ఉమ్మడి ఎజెండాతో ప్రజల వద్దకు వెళ్లాలనుకుంటున్న మహా కూటమికి కోదండరాం అధ్యక్షత వహించాలని టీజేఎస్‌ నేతలు ప్ర‌తిపాద‌న పెట్టిన సంగ‌తి తెలిసిందే. దీనికి సీపీఐ - తెలుగుదేశం పార్టీల మద్దతు లభించింది. అయితే రాష్ట్రంలో తమదే అతి పెద్ద పార్టీ కావటంతో తమ పార్టీ నాయకుడే ఉమ్మడి ఎజెండాను ముందుకు తీసుకు పోయే కమిటీకి నాయకత్వ వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ అంశం పైనే ప్రతిష్టంభన నెలకొన్నది. సీట్ల కేటాయింపు విషయంలో కూడా కాంగ్రెస్‌ నేతల నుంచి ఇప్పటి వరకూ సానుకూల స్పందన రాలేదు. 25 అసెంబ్లీ స్థానాలు తమకు కేటాయించాలని ఆ పార్టీ కోరుతుండగా ఆ పార్టీకి అంత సీన్‌ లేదంటూ కొందరు కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల కోదండరాం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. టీజేఎస్‌ కు కేవలం మూడు స్థానాలు కేటాయిస్తే సరిపోతుందని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఏఐసీసీకి చెప్పారని వచ్చిన వార్తలతో అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. బేరసారాల్లో కనీసం 17 సీట్లకు తగ్గకుండా తమకు కేటాయిస్తేనే ముందుకు పోవాలని టీజేఎస్‌ నిర్ణయించిన నేపధ్యంలో ఇప్పటి వరకూ పూర్తి స్థాయి చర్చలకు భాగస్వామ్య పార్టీలు ఉపక్రమించక పోవటం మరిన్ని ఉహాగానాలకు తెరలేపుతోంది.

అయితే ఈ సంక్షోభాన్ని బీజేపీ కైవ‌సం చేసుకోవాల‌ని చూస్తున్న‌ట్లు చెప్తున్నారు. బీజేపీ నుంచి టీజేఎస్‌ లోకి వచ్చిన కొందరు కీలక నేతలకు ఇప్పటికీ ఆ పార్టీతో సంబంధాలు ఉండటంతో వారి ద్వారా కోదండరాంను ఒప్పించే ప్రయత్నాలను చేస్తున్నట్టు తెలిసింది. పార్టీకి ఎన్నికల గుర్తు కోసం ఇటీవల ఢిల్లీ వెళ్లిన నేతలు కొందరు బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారని కూడా ఊహాగానాలు చెలరేగాయి. అయితే, బీజేపీతో కలిసే విషయంలో టీజేఎ స్‌ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వామపక్ష భావజాలం కలిగిన కొందరు నేతలు ఉద్యమ కాలంలోనూ - అంతకు ముందు కోదండరామ్‌ తో కలిసి పనిచేశారు. టీజెస్‌ లో చేరిన ఈ నేతలు బీజేపీతో కలిసి వెళ్లటానికి సుముఖంగా లేరు. ఇవ‌న్నీ ఎలా ఉన్నా...బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయంలో వస్తున్న వార్తలను టీజేఎస్‌ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌ ఇప్పటి వరకూ ఖండించక పోవటం కూడా అటువంటి ఊహాగానాలకు ఊతమిస్తున్నది. మ‌రోమైపు తాజాగా జ‌రిగిన బీజేపీ కోర్ క‌మిటీ స‌మావేశంలో ఢిల్లీ నుంచి వ‌చ్చిన బీజేపీ ప‌రిశీల‌కులు ఆమోదించిన‌ట్లు చెప్తున్నారు.