Begin typing your search above and press return to search.

కొడాలి నాని.. ఆ మాత్రం లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి

By:  Tupaki Desk   |   25 Aug 2022 1:30 PM GMT
కొడాలి నాని.. ఆ మాత్రం లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి
X
మంత్రిగా ఒక వెలుగు వెలిగి.. తాను టార్గెట్ చేసినోళ్లను ఇష్టారాజ్యంగా చెడుగుడు ఆడేసే తీరు కొడాలి నాని సొంతం. ఏం అంటున్నాను అన్న విషయాన్ని సైతం పట్టించుకోకుండా నోటికి పని చెప్పే ఆయన.. మంత్రి పదవి పోయిన తర్వాత మాత్రం తగ్గట్లేదు.

ఆయన మాటల దూకుడు ఎలా అయితే తగ్గలేదో.. ఆయన హవా కూడా తగ్గట్లేదు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. ఆయన మీద ప్రదర్శించే రాజభక్తికి లోటు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహించే గుడివాడ నియోజకవర్గంలో ఇప్పుడో వివాదం అంతకంతకూ ముదురుతోంది.

గుడివాడ పురపాలక సంఘం గేటు వద్ద ఆయనకు చెందిన భారీ ఫోటోను ఏర్పాటు చేశారు. మంత్రిగా ఉన్న వేళలో.. ఈ తరహా ఫోటోను ఏర్పాటు చేయటంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ ఆయన తగ్గలేదు. ఇప్పుడు మంత్రి పదవి పోయి.. ఉత్త ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. ఆయన ఫోటోను మార్చే సాహసం అధికారులు చేయటం లేదు. ఇదిలా ఉంటే.. ఆయన భారీ ఫోటోను ఎందుకు ఉంచుతున్నారన్న ప్రశ్నలు పెరుగుతున్నాయి.

తాజాగామాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్.. కొడాలినాని ఫోటోపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్రపతి.. ప్రధానమంత్రి.. ముఖ్యమంత్రికి సంబంధించిన ఫోటోలు మాత్రమే ఉంచాలే తప్పించి.. మంత్రులు..

ఎమ్మెల్యేల ఫోటోలు ఎలా పెడతారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కొడాలి ఫోటోను తొలగించి.. దానిస్థానే రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఫోటోను ఏర్పాటు చేయాలని ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయంలో అధికారుల తీరు మారకపోతే.. ధర్నా చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. కొడాలి నాని గురించి తెలిసిన అధికారులు మాత్రం ఆయన ఫోటో తొలగించే సాహసం చేయలేకపోతున్నట్లు చెబుతున్నారు. మిగిలిన చోట్ల ఎలా ఉన్నా.. తన సొంత నియోజకవర్గంలో ఈ తరహా హవా నడిపించే విషయంలో కొడాలి నాని తర్వాతే ఎవరైనా అన్న మాట వినిపిస్తోంది. కొడాలి నానినా మజాకానా?