Begin typing your search above and press return to search.

బాబుపై కొడాలి నోరు పారేసుకుంటున్నారా?

By:  Tupaki Desk   |   7 Aug 2020 2:40 PM IST
బాబుపై కొడాలి నోరు పారేసుకుంటున్నారా?
X
మరే పార్టీలో లేని రీతిలో కొందరు నేతలు చంద్రబాబు విషయంలో ఎంతలా విరుచుకుపడతారో తెలిసిందే. ఆయనపై ఒంటికాలిపై ఎగిరే నేతలుగా కనిపించే వారంతా.. గతంలో ఆయనకు వీర విధేయులుగా.. ఆయన ఎంత అంటే అంతన్నట్లుగా పని చేసిన వారే. కాలక్రమంలో తమ ఎక్స్ బాస్ విషయంలో వారు తిట్టినన్ని తిట్లు మరెవరూ తిట్టనట్లుగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నే తీసుకోండి. తెలంగాణ ఉద్యమం లాంటి కీలక సమయంలోనూ బాబు మీద ఈగ వాలకుండా చూసుకున్న ఆయన.. తర్వాతి కాలంలో గులాబీ కారు ఎక్కేయటం.. బాబుపై ఏ రేంజ్లో ఫైర్ అవుతారో తెలియంది కాదు.

మరే పార్టీలోనూ ఇలాంటివి ఇంత ఎక్కువగా కనిపించవు. రాజకీయ విభేదాలు కావొచ్చు.. తనకు సరైన అవకాశాలు ఇవ్వలేదన్న కోపంతో అధినేత మీద ఆగ్రహం వ్యక్తం చేయటం.. పార్టీని వీడిపోవటం కామనే. ఆ సందర్భంగా నాలుగు విమర్శలు చేస్తారు.. ఆగిపోతారు. కానీ.. బాబును తిట్టే నేతలు మాత్రం తరచూ లైమ్ లైట్ లో ఉండటం కనిపిస్తుంది. రోజులు గడిచే కొద్దీ.. వారు తిట్టే తిట్లు మరింత పవర్ ఫుల్ గా తయారవుతుంటాయి. తాజాగా ఏపీకి చెందిన కొడాలి నాని పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది.

2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన ఆయన.. కొద్ది కాలానికే తన పార్టీ పదవికి రాజీనామా చేయటం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాను భుజాన వేసుకోవటం తెలిసిందే. పార్టీ మారాలన్న నిర్ణయం తీసుకున్న నాటి నుంచి చంద్రబాబుపై అదే పనిగా ఘాటు విమర్శలు చేయటమే కాదు.. నాటు పద్దతిలో తిట్ల దండకాన్ని అందుకున్న వైనంపై తెలుగు తమ్ముళ్లు కిందామీదా పడుతుంటారు.

తాజాగా చంద్రబాబుపై మరోసారి ఆగ్రహంవ్యక్తం చేశారు. ఆయన్ను ఉద్దేశించి అసమర్థ.. చవట.. సన్నాసి అంటూ తిట్ల దండకాన్ని అందుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలో చేపట్టిన పథకాలకు సంబంధించి లోపాల్ని ఎత్తి చూపటమే కాదు.. బాబు గొప్పగా చెప్పుకున్న హౌసింగ్ స్కీంలోని లోపాల్ని ఎత్తి చూపటం గమనార్హం. తన విధేయుల్ని ఏజెంట్లుగా పెట్టుకొని ప్రజాసొమ్మును దోచేశారని ఆరోపించారు.

హౌసింగ్ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.1800 చొప్పున బాబు టెండర్లు ఖరారు చేస్తే.. ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న జగన్ కేవలం రూ.1312లకే చదరపు అడుగుకు టెండ్లను ఫైనల్ చేశారన్నారు. ప్రతి అడుగుకు రూ.500 చొప్పున సేవ్ చేశారన్నారు. ఆగస్టు 15 నాటికి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల్ని అందజేస్తామన్నారు. చంద్రబాబు తిట్టిపోయటం బాగానే ఉన్నా.. వాడే భాష హుందాగా ఉంటే బాగుంటుందన్న మాట వైఎస్సార్ కాంగ్రెస్ నేతల లోగుట్టుగా మాట్లాడుకోవటం గమనార్హం. నాటుభాషలో చంద్రబాబును తిట్టటం ద్వారా అనవసరమైన సానుభూతి కలిగే అవకాశం ఉందని.. కొడాలి నాని తప్పు చేస్తున్నారని.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పలువురు తమ ప్రైవేటు సంభాషణల్లో వ్యాఖ్యానించటం గమనార్హం. మరీ.. విషయాల్ని కొడాలి గుర్తిస్తారంటారా?