Begin typing your search above and press return to search.

వంగవీటి రాధాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని

By:  Tupaki Desk   |   27 Dec 2021 4:04 AM GMT
వంగవీటి రాధాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని
X
వంగవీటి రాధా పై కొడాలి నాని ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం చినగొన్నురు గ్రామంలో దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని విష్కరించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ వంగవీటి రాధా తనకు తమ్ముడని అన్నారు. తాను వైసీపీ లో ఉన్నానని, రాధా టీడీపీ ఉన్నాడు అనుకుంటా? అని వ్యగ్యాస్త్రాన్ని సంధించారు.

ఎమ్మెల్సీ ఇస్తామని అప్పటి టీడీపీ నాయకులు చెప్పినా.. పదవులను ఆశించకుండా ఆయన ఆ పార్టీలో చేరారని గుర్తుచేశారు. బంగారం లాంటి రాధా, తన జీవితంలో కాస్త రాగి మిశ్రమాన్ని కలిపి రాజీపడితే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. రాగి కలిపితేనె బంగారం కూడా కావలసిన ఆకృతిలో వస్తుందని చెప్పారు. కానీ కల్మషం లేకుండా తాను నమ్మిన దారిలోనే రాధా నడుస్తున్నాడని కొడియాడారు.

కొడాలి నాని, రాధా ప్రాణ స్నేహితులు. ఒకరి గెలుపును మరొకరు సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఏ పార్టీలో ఉన్నా ఇద్దరూ స్నేహంగా ఉండేవారు. ఇటీవల రాధాను వైసీపీలో చేర్చుకునేందుకు నాని ప్రయత్నాలు చేశారనే ప్రచారం ఉంది. అంతేకాదు రాధాను మండలికి పంపుతామనే ఆఫర్ కూడా ఇచ్చారని అప్పట్లు పుకార్లు వచ్చాయి. ఏమైందో ఏమో కాని ఆ ప్రచారం అలాగే మిలిగి ఉంది. దీన్ని కొనసాగింపుగా నాని కాని రాధా కాని ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు రాధాపై నాని ప్రశంసలు గుప్పించడం ఇప్పుడు కొత్త కాదు గతంలోనూ అనేక సార్లు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వంగవీటి మోహనరంగా 33వ వర్ధంతి కార్యక్రమంలో నాని, వల్లభనేని వంశీ పాల్గొన్నారు. రంగాను కీర్తిస్తూ.. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ప్రకటించారు.

అయితే ఏమైందో ఏమో కాని రాధా, నాని ప్రత్యర్థులు కాబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. నానిపై రాధా పోటీకి దిగుతారనే గుసగుసులు వినిపించాయి. అందుకు కారణాలు కొందరు చెప్పారు. గుడివాడ కేంద్రంగా రాధా తరచూ పర్యటనలు చేస్తున్నారని, అంతేకాదు కాపు సామాజిక వర్గ నేతలతో రాధా భేటీ అవుతున్నారనే ప్రచారం జరిగింది. గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు రాధా పూనుకున్నారనే వార్తలు అప్పట్లో హల్‌చల్ చేశాయి. ఈ రోజు జరిగిన సంఘటనలో ఆ ప్రచారమంతా అబద్ధమని తేలిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏకంగా రాధాను బంగారంతో పొల్చడం... తనకు తమ్ముడని సంబోధించి నాని అందరి నోళ్లు మూయించారని ఇరు నేతల అభిమానులు అంటున్నారు.