Begin typing your search above and press return to search.

కిషన్ రెడ్డి అంతకంతకూ ఎదిగిపోతున్నాడుగా? కర్ణాటకకు పంపారంటే?

By:  Tupaki Desk   |   27 July 2021 5:42 PM IST
కిషన్ రెడ్డి అంతకంతకూ ఎదిగిపోతున్నాడుగా? కర్ణాటకకు పంపారంటే?
X
ఎంత కష్టపడినా కొన్నిసార్లు ఫలితం రాదు. మరికొన్ని సార్లు పెద్దగా పని చేయకున్నా.. కష్టపడకున్నా అనుకున్న దాని కంటే అద్భుతమైన ఫలితాలు వస్తుంటాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విషయంలో మాత్రం పై రెండు పోలికలు ఆయనకు వర్తించవు. అంచలంచెలు ఎదుగుతూ.. ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ.. ఎదిగే కొద్ది ఒదిగి ఉంటూ.. దర్పం ప్రదర్శించకుండా.. వినయ విధేయతల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ.. పని రాక్షసుడిలా పని చేస్తూ.. అనవసరమైన వివాదాల్ని తన దరికి చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటూ.. ఇలా ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండే కిషన్ రెడ్డికి ఈ మధ్యన అవకాశాలు ఒక్కొక్కటిగా దగ్గరకు వస్తున్నాయి.

2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన అంబర్ పేట నుంచి పోటీ చేసి.. ఓటమిపాలైన ఆయన.. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి బీజపీ అభ్యర్థిగా పోటీ చేసి.. అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. మోడీ ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రి పదవిని చేజిక్కించుకున్న ఆయన.. మొదటి రెండేళ్లలో తన పని తీరుతో మోడీషాల మనసుల్ని దోచేశారని చెప్పాలి. మోడీకి కుడి భుజం లాంటి అమిత్ షా కింద పని చేసినప్పుడు..ఆయన దగ్గర మెప్పు పొందటం మామూలు కాదు. ఈ లిట్మస్ టెస్టులో పాస్ అయిన కిషన్ రెడ్డికి ఈ మధ్యన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో కేంద్రమంత్రి హోదా లభించటం తెలిసిందే.

తాజాగా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యడ్యూరప్పను మార్చి.. కొత్త సీఎంను ఎంపిక చేసేందుకు ఈ సాయంత్రం పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి పార్టీ పరిశీలకులుగా ఇద్దరి ఎంపిక చేస్తే.. అందులో ఒకరు కిషన్ రెడ్డి కావటం గమనార్హం. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి వెళుతున్న కిషన్ రెడ్డి.. ఈ రోజు (మంగళవారం) సాయంత్రం ఏడు గంటలకు బెంగళూరులోని క్యాపిటల్ హోటల్ లో జరిగే భేటీలో కొత్త సీఎంను ఎంపిక చేస్తున్నారు. ఈ కీలక బాధ్యతను కిషన్ రెడ్డికి అప్పగించటం అంటే.. మోడీషాలు ఆయనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

కిషన్ రెడ్డి.. ధర్మేంద్ర ప్రదాన్ లు ఇద్దరు బెంగళూరులో పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపి.. ఆ తర్వాత సీఎం పేరును డిసైడ్ చేస్తారని చెబుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న వారి జాబితా కాస్త పెద్దదిగానే ఉంది. అందులో.. ప్రహ్లాద్ జోషి.. బీఎల్ సంతోశ్.. వివ్వేశ్వర హెగ్డే కాగేరి.. బసవరాజు బొమ్మై.. సీటీ రవి.. సదానంద గౌడ్.. జగదీశ్ శెట్టర్ పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఎంపిక చేసే నేతకు సంఘ్ బ్యాక్ గ్రౌండ్.. సామాజిక బలం.. నాయకత్వ లక్షణంతో పాటు.. కర్ణాటక ఉత్తర ప్రాంతానికి చెంది ఉండటం లాంటి లక్షణాలు తప్పనిసరిగా ఉండాలని చెప్పక తప్పదు.

కానీ.. పరిశీలకులుగా వెళ్లిన కేంద్రమంత్రులు ఇద్దరు పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయి.. వారి ఇష్టాయిష్టాల్ని తెలుసుకోవటం అన్నది ఉత్త ఫార్సుగా చెప్పాలి. ఎందుకంటే.. ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని అధినాయకులైన మోడీషాలు ఎప్పుడో డిసైడ్ చేసి ఉంటారు. కాకుంటే.. జరగాల్సిన ప్రక్రియను శాస్త్ర బద్ధంగా జరిపించి.. అధిష్ఠానం కోరుకున్న వ్యక్తి చేతికి సీఎం పగ్గాలు ఇచ్చి రావటమే కిషన్ రెడ్డి.. ధర్మేంద్రల టాస్కుగా చెప్పాలి. ఇదంతా చూస్తున్నప్పుడు.. చూస్తున్నంతలోనే కిషన్ రెడ్డి పార్టీలో అంతకంతకూ ఎదిగిపోతున్నారని చెప్పక తప్పదు.