Begin typing your search above and press return to search.

వెయ్యి మంది కేసీఆర్ లు ఉన్నా తెలంగాణ వచ్చేది కాదనే మాట ఇప్పటికా?

By:  Tupaki Desk   |   31 Oct 2020 1:20 PM IST
వెయ్యి మంది కేసీఆర్ లు ఉన్నా తెలంగాణ వచ్చేది కాదనే మాట ఇప్పటికా?
X
ఎప్పుడేం చేయాలో అది చేయాలి. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయాల్లో ఆలస్యానికి మించిన ఖరీదైన తప్పు మరొకటి ఉండదు. ఆ విషయాన్ని బీజేపీ లాంటి పార్టీ మర్చిపోవటం ఏమిటి? అన్నది ప్రశ్న. దుబ్బాక ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతున్న వేళ.. రెండు పార్టీల మధ్య ఆరోపణలు.. ప్రత్యారోపణలు.. విమర్శలు.. ప్రతి విమర్శలు జోరుగా సాగుతున్నాయి.

మొదట్లో అనుకున్న దాని కంటే మిన్నగా దుబ్బాకలో బీజేపీ తన సత్తా చాటుతున్న వేళ.. టీఆర్ఎస్ తన అమ్ములపొదిలోని ఎమోషనల్ అస్త్రాన్ని బయటకు తీసింది. కమలనాథుల మీద గురి పెట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ చేసిందేమీ లేదన్న విషయాన్ని బలంగా చెప్పటం షురూ చేశారు. ఈ ప్రచారానికి చెక్ పెట్టేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. తెలంగాణలోకుటుంబ.. అవినీతి పాలన సాగుతుందని.. సంక్షేమ పథకాల్లోకేంద్రం వాటాపై మంత్రి హరీశ్ చెప్పేవన్ని అబద్ధాలేనని పేర్కొన్నారు.

పంటల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటంలేదన్న కిషన్ రెడ్డి.. ఏ ఉద్దేశంతో.. ఏ లక్ష్యంతో తెలంగాణను తెచ్చుకున్నామో.. ఆ దిశగా రాష్ట్రం పయనించటం లేదన్న ఆవేదనను వ్యక్తం చేశారు.బీజేపీ కానీ లేకుంటే వెయ్యి మంది కేసీఆర్ లు ఉన్నా.. తెలంగాణ వచ్చేది కాదని స్పష్టం చేశారు. నాడు రాజ్ నాథ్ సింగ్.. సుష్మా స్వరాజ్ తదితరులు కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్నిసాకారం చేశారన్నారు.

ఈ వాదనలో పస సంగతి ఎలా ఉన్నా.. ఎప్పుడో ఆరేళ్ల క్రితం తెలంగాణ వస్తే.. దాని మైలేజీని సొంతం చేసుకోవటానికి ఇప్పటికి గుర్తుకు వచ్చిందా? అన్నది ప్రశ్నగా మారింది. తెలంగాణ సాధనలో బీజేపీ పోషించిన పాత్రను గొప్పగా చెప్పుకున్నది లేదు. అలాంటి కిషన్ రెడ్డి.. తాజాగా మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీనే కీలకమని చెప్పుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది మర్చిపోకూడదు. అందునా.. హాట్ హాట్ గా సాగుతున్న దుబ్బాక ఉప ఎన్నికల వేళ.. తెలంగాణ సాధనలో తమ పాత్ర గురించి ప్రస్తావించటం ఏ మాత్రం సరైన టైమింగ్ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.