Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను మెచ్చుకున్న కిర‌ణ్‌ కుమార్‌ రెడ్డి

By:  Tupaki Desk   |   17 March 2016 5:13 PM IST
కేసీఆర్‌ ను మెచ్చుకున్న కిర‌ణ్‌ కుమార్‌ రెడ్డి
X
న‌ల్లారి కిర‌ణ్‌ కుమార్ రెడ్డి. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి. క్రియాశీల రాజ‌కీయాల నుంచి తెర‌మరుగు అయి రెండేళ్లు కావ‌స్తున్నప్ప‌టికీ, రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న ఈ మాజీ సీఎం త‌న ద‌గ్గ‌రివారితో మాత్రం ట‌చ్‌ లో ఉంటున్నారు. అలా ఇటీవ‌లే త‌న స‌న్నిహితుల‌తో మాట్లాడుతూ, టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను మెచ్చుకున్నారు. అదికూడా టీడీపీ నాయ‌కుడి ద‌గ్గ‌ర కావ‌డం మ‌రింత ఆస‌క్తిక‌రం.

కిర‌ణ్‌ కుమార్‌ రెడ్డి సీఎంగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న‌తో న‌డిచి అనంత‌రం ఆయ‌న స్థాపించిన జై స‌మైక్యాంధ్ర పార్టీలో చేరి ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న ఓ నాయ‌కుడు తాజాగా కిర‌ణ్‌ కుమార్ రెడ్డిని క‌లిశారు. ఆ సంద‌ర్భంగా కిర‌ణ్‌ కుమార్‌ రెడ్డి ఏ మాట్లాడారో అసెంబ్లీ లాబీల్లో త‌న‌ను క‌లిసిన విలేక‌రుల‌తో ఆ నాయ‌కుడు వెల్ల‌డించారు. తెలంగాణ ఏర్పడితే హైద‌రాబాద్‌ లో లా ఆండ్ ఆర్డ‌ర్ కంట్రోల్ ఉండ‌ద‌ని తాను భావించిన‌ప్ప‌టికీ ఇపుడు అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని కిర‌ణ్ కితాబిచ్చార‌ట‌. అంతే కాకుండా దేశ‌వ్యాప్తంగా శాంతిభ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పుతున్న‌ప్ప‌టికీ కేసీఆర్ పాల‌న‌లో హైద‌రాబాద్‌ లో పూర్తి భ‌ద్ర‌త ఉంద‌ని త‌నతో ప‌లువురు చెప్తున్నార‌ని అంతే కాకుండా త‌న ప‌రిశీల‌న‌లో కూడా అది స్ప‌ష్ట‌మైంద‌ని కిర‌ణ్ ఆ నాయ‌కుడితో వివ‌రించారు. దీంతో పాటు ఏపీ మంత్రి కుమారుడు ఒక‌రు చేసిన ప‌ని విష‌యంలో ఒత్తిడికి లొంగి, మొహ‌మాటానికి పోయి కేసును నీరుగారుస్తాడ‌ని సందేహ‌ ప‌డ్డ‌ప్ప‌టికీ కేసీఆర్ అలా చేయ‌లేద‌ని కిర‌ణ్ మెచ్చుకున్నార‌ట‌.

అయితే ఎంఐఎం విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉంటేనే కేసీఆర్ క‌ల‌లుగంటున్న విశ్వ‌న‌గ‌రం క‌ల నెర‌వేరుతుంద‌ని కిర‌ణ్ స‌దరు నాయ‌కుడితో అభిప్రాయ‌ప‌డ్డార‌ట‌. మొత్తంగా కిర‌ణ్ రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న‌ట్లుంది కానీ రాజ‌కీయ ప‌రిణామాల‌కు కాద‌ని ఆయ‌న విశ్లేష‌ణ‌ను చూస్తుంటేనే తెలుస్తోంది.