Begin typing your search above and press return to search.

మాజీ సీఎంకు రాజ‌కీయ క్లారిటీ వ‌చ్చింది

By:  Tupaki Desk   |   29 Dec 2015 11:38 AM IST
మాజీ సీఎంకు రాజ‌కీయ క్లారిటీ వ‌చ్చింది
X
నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి... తెలుగు రాజ‌కీయాల్లో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ముఖ్య‌మంత్రి ప‌గ్గాలు చేప‌ట్టిన కాంగ్రెస్ నాయ‌కుడు. రాష్ర్ట విభ‌జ‌న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి అయిన న‌ల్లారి వారు అదే విభ‌జ‌న అంశంతో తెర‌వెన‌క్కు పోయారు. క‌రెక్టుగా చెప్పాలంటే క‌నుమ‌రుగు అయిపోయారు. ఏకంగా తెలుగు రాష్ర్టాల‌ను వ‌దిలిపెట్టి బెంగ‌ళూరులో స్థిర‌ప‌డ్డారు. ఆయ‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌ పై ఆయ‌న‌కే క్లారిటీ లేని పరిస్థితి.

విభ‌జ‌న‌ను నిర‌సిస్తూ విమ‌ర్శించిన కాంగ్రెస్ వైపు క‌న్నెత్తి చూడ‌లేరు. పోనీ అధికార బీజేపీలో చేరుదామంటే ఆయ‌న స‌త్తా తెలిచి బీజేపీ దూరం పెడుతోంది. ఇలాంటి రాజ‌కీయ అస్ప‌ష్ట‌త‌లో ఉన్న కిర‌ణ్ కుమార్‌ రెడ్డి ఎప్పుడో ఒక‌సారి...అది కూడా బాగా ద‌గ్గ‌రైన వ్య‌క్తులకు చెంది శుభ‌కార్యాల‌కు త‌ప్ప మ‌రి దేనికి ఆయ‌న హాజ‌రుకావ‌డం లేదు. తాజాగా మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ కు చెందిన రాజీవ్‌ గాంధీ విద్యాసంస్థల సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనడానికి రాజమండ్రి వెళ్లారు. తనను కలిసిన మాజీ ఎమ్మెల్యేలు - నాయకులతో ఈ మాజీ ముఖ్యమంత్రి కాసేపు ముచ్చ‌టించారు. ఏ పార్టీలోనూ చేరకుండా తటస్థంగా ఉండిపోయిన పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ కిర‌ణ్‌ కుమార్ రెడ్డితో స‌హా త‌న‌లాంటి వారి భవిష్యత్ కార్యాచరణను లేవనెత్తారు. దీనిపై కిరణ్‌ కుమార్‌ రెడ్డి స్పందిస్తూ ‘వేచి చూద్దాం. అప్పుడే తొందర లేదు’ అని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా తనను కలిసిన మాజీ ఎమ్మెల్యేలు - నాయకులతో కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రప్రభుత్వం పని తీరు, ఇరిగేషన్ ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం సరికాదని, దీనివల్ల కృష్ణా డెల్టాకు ఏమంత ప్రయోజనం ఉండదని చెప్పారు. కృష్ణా బ్యారేజి బేసిన్‌ లో 3టీఎంసీల నీటిని నిల్వచేయవచ్చని, కానీ బేసిన్‌ లో 1టీఎంసీ నీటి నిల్వకు సరిపడా ప్రాంతం ఇసుక మేటలతో నిండి ఉందని, మరో 1.5 టీఎంసీ నీటిని వీటీపీఎస్‌ కు సరఫరాచేయాల్సి ఉంటుందని, ఇక మిగిలిందల్లా 0.5టిఎంసీ మాత్రమేనన్నారు. ఈ మాత్రం దానికి అంత డబ్బు ఖర్చుచేసి పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించాల్సిన అవసరం లేదని మాజీ ఎమ్మెల్యేలకు వివరించినట్టు తెలిసింది.

నాయ‌కుల‌తో న‌ల్లారి వారి భేటీ చూస్తే.... క్రియాశీలంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న‌ట్లున్నారే త‌ప్పితే... మాన‌సికంగా ప‌రిణామాల‌న్నింటినీ జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్న‌ట్లే ఉంద‌ని ఆయా వ‌ర్గాలు చ‌ర్చిస్తున్నాయి.