Begin typing your search above and press return to search.

కుర్ర ఎంపీ కొత్త భాష్యం

By:  Tupaki Desk   |   23 May 2016 9:40 AM GMT
కుర్ర ఎంపీ కొత్త భాష్యం
X
ఏపీలో బీజేపీ - టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మామూలుగా లేదు. ఈ యుద్ధాలు చూస్తుంటే రెండు పార్టీల పొత్తుకు ముగింపు పలుకుతారా అన్న అనుమానాలూ చాలామందిలో కలుగుతున్నాయి. అయితే.. రెండు పార్టీల పెద్దలు మాత్రం భాయిభాయి అనుకుంటున్నారు. దీంతో రెండు పార్టీల వ్యవహారమేంటో అర్థం కాక జనంలో గందరగోళం ఏర్పడుతోంది. నేతలు తిట్టుకోవడం.. పార్టీలుగా కలిసి కనిపిస్తుండడంతో ఇదేం విధానం అనకుంటున్నారు. కాగా... రెండు పార్టీల మధ్య కనిపిస్తున్న ఈ ప్రత్యేక పరిస్థితిపై శ్రీకాకుళం ఎంపీ - యువకుడు అయిన కింజరాపు రామ్మోహననాయుడు మాత్రం ఇది ఏమంత ఇబ్బందికరం కాదని చెబుతున్నారు. ఈ మాటల యుద్ధాలన్నీ వ్యక్తుల మధ్యే కానీ, పార్టీలపరంగా ఆ పరిస్థితి లేదంటూ కొత్త భాష్యం చెబుతున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదాపై మిత్రపక్షాలు టీడీపీ - బీజేపీల మధ్య మాటల యుద్ధ జరగడం లేదని.. కేవలం రెండు పార్టీలకు చెందిన నేతలు వ్యక్తిగత స్థాయిలోనే పోట్లాడుకుంటున్నారని కింజరాపు చెబుతున్నారు. రెండు పార్టీల మధ్య విభేదాలు ఏమీలేవని.. అంతా నేతల మధ్య ఉన్న విభేదాలేనని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాలతో ఏపీని పోల్చి చూడటాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మానుకోవాలన్నారు. రాష్ట్రానికి కేంద్ర మంత్రులు రావడం తప్పేమీ కాదని ప్రకటించిన ఆయన... అయితే ఇక్కడికొచ్చే కేంద్ర మంత్రులు ప్రజలకు నిజాలు చెప్పాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

అయితే... ఏపీ బీజేపీ నేతలు నేరుగా చంద్రబాబునే టార్గెట్ చేసి మాటలు విసరుతుండడంతో మరి చంద్రబాబుకు, వారికి మధ్య వ్యక్తిగత విభేదాలు ఏమున్నాయన్నది మాత్రం రామ్మోహననాయుడు చెప్పలేకపోతున్నారు. రెండు పార్టీల మధ్య తీవ్ర అంతర్యుద్ధం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్న తరుణంలో కింజరాపు ఇలా కవరింగ్ మాటలు చెబుతుండడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.