Begin typing your search above and press return to search.

సానియాను అప్పగించమంటున్నారు

By:  Tupaki Desk   |   7 July 2016 10:08 AM IST
సానియాను అప్పగించమంటున్నారు
X
సంచలనం రేపిన ప్రేమించి పెళ్లాడిన భార్యను అత్యంత కిరాతకంగా చంపిన రూపేశ్ వ్యవహారం తెలిసిందే. కాంగో దేశానికి చెందిన సింథియాను లవ్ మ్యారేజ్ చేసుకొని.. ఇటీవల విడిపోవాలన్న ప్రతిపాదనతో పాటు.. తన కూతురిని తనతో తీసుకెళతానన్న ఆమెను అత్యంత కిరాతకంగా ముక్కలుముక్కలుగా నరికి గుట్టుచప్పుడు కాకుండా తగలబెట్టే ప్రయత్నం చేసి దొరికిన ఉదంతంలో మరోపరిణామం చోటు చేసుకుంది.

రూపేష్ ను కఠినంగా శిక్షించాలని కోరుతూ సింధియా సోదరుడు డానీష్ తో పాటు.. ఇతర బంధువులు అర్జీఐఏ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. అంతేకాదు.. తమ సోదరి కుమార్తె సానియాను చూపించాలని.. తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రూపేష్ కు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనల నేపథ్యంలో సానియాను.. వారి మేనమామలకు చూపించారు.

ప్రస్తుతం సానియా.. రూపేష్ తల్లి వద్ద ఉంది. సానియాను చూసిన ఆమె మేనమామలు తమ మేనకోడల్ని తమకు అప్పగించాలని కోరుతున్నారు. భార్యను చంపిన కిరాతకుడు రూపేష్.. బిడ్డను కూడా చంపే ప్రమాదం ఉన్నందున తమకు ఇచ్చేయాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సింథియా బంధువులకు పోలీసులు నచ్చజెప్పి.. చట్టప్రకారం తాము నడుచుకుంటామని చెప్పి.. వారు చేస్తున్న ఆందోళనను విరమించే ప్రయత్నం చేశారు.