Begin typing your search above and press return to search.

కిమ్ దిష్టిబొమ్మ దహనం: నవ్వులపాలైన బీజేపీ కార్యక్రమం

By:  Tupaki Desk   |   19 Jun 2020 9:30 AM GMT
కిమ్ దిష్టిబొమ్మ దహనం: నవ్వులపాలైన బీజేపీ కార్యక్రమం
X
భారత్-చైనా మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చుతోంది. రెండు దేశాల మధ్య వివాదంతో సైనికులు బలవుతున్నారు. ఈ క్రమంలోనే ఘర్షణలు తలెత్తి 20 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. ఈ ఘటనపై భారతదేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు చైనా దేశంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఆ దేశానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఈ సందర్భంగా చైనా తీరును ఎండగడుతూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయితే ఒకచోట ఈ కార్యక్రమం నిర్వహించిన బీజేపీ నాయకులు నవ్వుల పాలయ్యారు. దిష్టిబొమ్మ దహనంతో పాటు ఆ నాయకులు మాట్లాడిన తీరుతో కడుపుబ్బా నవ్వుకోవచ్చు.

పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌ లో బీజేపీ నాయకులు చైనాకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. వారికి ఎందుకు ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నామో.. ఎవరిపై ఆందోళన చేయాలో తెలియని పరిస్థితి. వారి అవగాహనరాహిత్యం బీజేపీ పరువు పోయింది. అసన్‌సోల్‌లో బీజేపీ కార్యకర్తలు చైనాకు వ్యతిరేకంగా గురువారం(జూన్ 18)న ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ దిష్టిబొమ్మకు బదులు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. సైనికుల మృతికి కిమ్ జోంగ్ కారణంగా పేర్కొంటూ అతడి దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం బీజేపీ నాయకుడు మీడియాతో మాట్లాడాడు... చైనా ప్రధానమంత్రి కిమ్ జోంగ్ ఉన్ అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా చైనా వస్తువులను ఉపయోగించవద్దని స్వదేశీ వస్తువులనే ఉపయోగించాలని పిలుపునిచ్చాడు. కిమ్ జోంగ్ ఉన్‌ను చైనా ప్రధానమంత్రిగా ఆ బీజేపీ నేత పేర్కొనడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్స్ విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. దీన్ని చూసిన వారందరూ తెగ నవ్వుతున్నారు.