Begin typing your search above and press return to search.

కిమ్​ దూకుడు..అమెరికాకే కాదు..ప్రపంచం మొత్తానికి చెమటలు

By:  Tupaki Desk   |   13 Oct 2020 1:40 PM IST
కిమ్​ దూకుడు..అమెరికాకే కాదు..ప్రపంచం మొత్తానికి చెమటలు
X

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ అంటేనే వివాదాలకు కేంద్ర బిందువు. నిరంతరం పొరుగుదేశాలు, అగ్రదేశమైన అమెరికాతో కయ్యానికి సిద్ధమవుతుంటాడు. ప్రతిక్షణం యుద్ధ కాంక్ష తో రగిలిపోతుంటాడు. తాజాగా ఉత్తర కొరియా ఓ కొత్త ఖండాంతర క్షిపణిని ఆవిష్కరించింది. అయితే ఇది అత్యంత భారీ పరిణామంలో ఉన్నది. ఈ క్షిపణి పరిమాణాన్ని చూసి అంతర్జాతీయంగా ఉన్న రక్షణ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆ క్షిపణి ఏమిటి? దానితో అమెరికాకు, ప్రపంచానికి ఎందుకు ముప్పు వాటిల్లుతుందో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ఉత్తర కొరియాలో అధికార వర్కర్స్ పార్టీ 75వ వార్షికోత్సవం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశంలో ఓ భారీ కవాతును నిర్వహించారు. ఈ వేడుకను అత్యంత అట్టహాసంగా నిర్వహించారు.

అయితే ఈ వార్షికోత్సంలో ఆ దేశ సైనికులు ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించారు. ఉత్తర కొరియా వద్ద ఇప్పటికే విజయవంతంగా పరీక్షించిన ఖండాంతర క్షిపణులు ఉన్నాయి. ఒకటి.. హాసాంగ్-14‌ను 2017లో రెండు సార్లు ప్రయోగించారు. దీని లక్ష్య పరిది 10,000 కిలోమీటర్లు. ఇది అణ్వస్త్రాన్ని తీసుకుని కొరియా నుంచి పశ్చిమ యూరప్ మొత్తాన్నీ, అమెరికా సగం భూభాగాన్ని తాకగలదు. 2017లోనే పరీక్షించిన హాసాంగ్-15 క్షిపణికి 13,000 కిలోమీటర్లు లక్ష్య పరిధి ఉంది. అంటే.. అమెరికా భూభాగం మీద ఎక్కడికైనా ఇది అణ్వస్త్రాన్ని ప్రయోగించగలదు.

ఇక కొత్తగా ప్రదర్శించిన ఖండాంతర క్షిపణిని ఇంకా పరీక్షించాల్సి ఉంది. ఇది రెండంచెల లిక్విడ్ ఫ్యూయల్డ్ మిసైల్. హాసాంగ్-15 కన్నా చాలా ఎక్కువ పొడవు, లావు ఉన్న క్షిపణి ఇది. అయితే ఒకే క్షిపణితో బహుళ అణ్వస్త్రాలను ప్రయోగించటం మీద వారు ఉత్తర కొరియా దృష్టి పెడుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఇక్కట్లలో ఉన్న అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థలకు ఇది మరో దెబ్బ అవుతుంది. ఎందుకంటే.. దాడికి వస్తున్న ఒక్కో వార్‌హెడ్‌ను నిర్వీర్యం చేయటానికి బహుళ ఇంటర్సెప్టర్లను లాంచ్ చేయాల్సి ఉంటుంది. అత్యంత క్లిష్టమైన ఈ సంవత్సరంలో ఉత్తర కొరియా కొత్తగా ఓ భారీ ఖండాంతర క్షిపణిని తయారుచేసి ప్రదర్శించటం.. తమ దేశాన్ని, తమ నాయకుడిని, తమ ప్రజల సాంకేతిక సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయవద్దని ప్రపంచానికి సందేశం ఇవ్వడమేనని రక్షణరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.