Begin typing your search above and press return to search.

అప్పటివరకు తక్కువగా తినండి ...దేశ ప్రజలకి ఆ అధినేత ఆదేశాలు

By:  Tupaki Desk   |   28 Oct 2021 11:30 PM GMT
అప్పటివరకు తక్కువగా తినండి ...దేశ ప్రజలకి ఆ అధినేత ఆదేశాలు
X
ప్రపంచ దేశాలలో ఆ దేశం పేరు తీస్తే ఎవరైనా కూడా వణికిపోవాల్సిందే. ఆదేశం పేరు చెప్పగానే ఆదేశ అధ్యక్షుడు కిమ్ జోన్ ఉంగ్ తో పాటు అణ్వయుధాలే గుర్తుకోస్తాయి. అదే ఉత్తర కొరియా దేశం. తాజాగా ఆదేశ అధ్యక్షుడు కిమ్ దేశ ప్రజలు తక్కువగా తినాలని వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఉత్తర కొరియా తీవ్ర ఆహార సంక్షోభంలో కూరుకుపోయింది. దీనితో 2025 వరకు దేశ ప్రజలు తక్కువగా ఆహారాన్ని తీసుకోవాలని అధ్యక్షుడు ఆదేశించాడు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ప్రణాళికకు అనుగుణంగా లక్ష్యాలను సాధించలేదని, అందుకే ఆహార ధాన్యాల కొరత వచ్చిందని కిమ్ అక్కడి అధికారులను నిందిస్తున్నట్లు సమాచారం. క‌రోనా, అంత‌ర్జాతీయ ఆంక్షలతో ఉత్త‌ర కొరియా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సరిహద్దులు మూసివేయడంతో చైనా, ర‌ష్యా నుంచి దిగుమతులు ఆగిపోయాయి.

దీంతో దేశంలో ఆహారం కొర‌త తీవ్ర‌స్థాయికి చేరుకున్న‌ది. దేశీయంగా ఉత్ప‌త్తి చేస్తున్నప్పటికీ త‌గినంత‌గా లేక‌పోవ‌డంతో కొర‌త పెరిగిపోతున్న‌ది. దేశ ర‌క్ష‌ణ‌కు ఇచ్చిన ప్రాధాన్య‌త ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ‌, ఆహార ఉత్ప‌త్తికి ఇవ్వ‌లేద‌ని ప్ర‌పంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు మార్గాలను చూడాలని కిమ్ అధికారులను ఆదేశించారు. గత వేసవి తీవ్రమైన వర్షాలు, వరదల కారణంగా ఉత్తర కొరియాలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇదే కాకుండా కరోనా నేపథ్యంలో ఉత్తర కొరియా సరిహద్దులను మూసివేసింది. ఇది చైనాతో వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపింది. దీని కారణంగా దేశంలో ఆహార ధాన్యాల రేటు విపరీతంగా పెరిగింది.

దీని కారణంగా 25 మిలియన్లు ఉన్న ఉత్తర కొరియాలో ఆకలి చావులకు కారణమైంది. రాబోయే శీతాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని తెలుస్తోంది. త‌మ దేశంలో ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని చెబుతూనే దేశ ప్ర‌జ‌ల‌కు కిమ్ కొన్ని కీల‌క సూచ‌న‌లు చేశారు. 2025 వ‌ర‌కు ప్ర‌జ‌లు త‌క్కువ‌గా ఆహారం తీసుకోవాల‌ని, చైనాతో స‌రిహ‌ద్దులు ఓపెన్ కావ‌డానికి మ‌రో మూడేళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌ని, అప్ప‌టి వ‌ర‌కు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కిమ్ సూచించారు. దేశంలో నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉద్యోగాలు లేక‌, తినేందుకు స‌రైన తిండి లేక ప్ర‌జ‌లు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కిమ్ స్వయంగా ప్రజలని తక్కువగా తినండి అని చెప్పడం గమనార్హం.