Begin typing your search above and press return to search.

కోమాలో కిమ్.. మరోసారి అదే తరహా వార్తలు

By:  Tupaki Desk   |   24 Aug 2020 10:45 AM IST
కోమాలో కిమ్.. మరోసారి అదే తరహా వార్తలు
X
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు.. వాటికి దేశాధ్యక్షులు ఉన్నప్పటికీ.. కొందరి గురించి మాత్రంయావత్ ప్రపంచం మాట్లాడుకుంటూ ఉంటుంది. పాలనలో కర్కసత్వాన్ని.. ఆధునిక ప్రపంచంలో ప్రజల్ని బానిసల కంటే హీనంగా చూసే దేశాధ్యక్షుల జాబితాలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ముందుంటారు. ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదన్న వార్తలు రావటం తెలిసిందే. ఈ వార్తల పరంపర సాగుతున్న వేళ.. వాటికి జవాబుగా కిమ్ ఒక కార్యక్రమంలో హాజరైన వీడియోను విడుదల చేశారు. అందులో ఆయన హుషారుగా కనిపించటం ద్వారా.. ఆయనకు ఏం కాలేదు.. ఆరోగ్యం భేషుగ్గా ఉన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు.

అయితే.. ఆ ఫోటోల్లో కొన్ని తేడాలపై భారీ ఎత్తున చర్చ జరిగింది. ఇదిలా ఉండగా.. రెండు..మూడు రోజుల క్రితమే కిమ్ సోదరికి పాలనకు సంబంధించి కీలక బాధ్యతలు అప్పజెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదని.. ఆయనిప్పుడు కోమాలో ఉన్నట్లుగా దక్షిణ కొరియా అధికారి సంచలన ప్రకటన చేశారు. తమ దేశానికి చెందిన గూఢచర్య వర్గాలు ఈ విషయాల్ని వెల్లడించినట్లుగా పేర్కొన్నారు.

గతంలో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే జంగ్ కు సహాయకుడిగా వ్యవహరిస్తున్న చాంగ్ సాంగ్ మిస్ ఈ సంచలన విషయాల్ని వెల్లడించారు. కిమ్ కోమాలోకి వెళ్లటంతో ఉత్తరకొరియా అధ్యక్ష బాధ్యతల్ని కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ చూస్తున్నట్లుగా వెల్లడించారు. ‘కిమ్ కోమాలో ఉన్నట్లుగా అంచనా వేస్తున్నా. కానీ.. అతను మరణించలేదు’’ అని పేర్కొన్నారు.

కిమ్ అనారోగ్యంతో ఉన్న కారణంగా ఈ ఏడాది బయటకు రావటం బాగా తగ్గించినట్లుగా చెప్పారు. ప్రస్తుతం ఉత్తర కొరియా బాధ్యతల్ని చేపట్టేందుకు కిమ్ సోదరి రెఢీగా ఉన్నట్లుగా ఆయన చెప్పారు. ఉత్తర కొరియాకు పక్కనే ఉన్న దక్షిణ కొరియాకు చెందిన చాంగ్ సాంగ్ మిస్ వెల్లడించిన ఈ వివరాలు ఎంతమేరకు నిజమన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై క్లారిటీ రావాలంటే ఉత్తరకొరియా నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.