Begin typing your search above and press return to search.

కిమ్ మరో కీలక నిర్ణయం ...దక్షిణకొరియా తో తెగదెంపులు !

By:  Tupaki Desk   |   9 Jun 2020 8:10 AM GMT
కిమ్ మరో కీలక నిర్ణయం ...దక్షిణకొరియా తో తెగదెంపులు !
X
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగా మారుతుంది. ఏప్రిల్ లో కిమ్ 20 రోజులపాటు ఎవరికీ కనిపించకుండా దూరంగా ఉన్నారు. ఆ సమయంలో కిమ్ గురించిన అనేక సందేహాలు బయటకు వచ్చాయి. కిమ్ మరణించాడని చాలామంది అనుకున్నారు. కానీ , ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటంలా బయటకి వచ్చి ..అందరూ నిర్ఘాంత పోయేలా చేసాడు. ఇదిలా ఉంటె, ఇప్పుడు కిమ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

దక్షిణ కొరియాతో సైనిక, రాజకీయ పరమైన అన్ని సంబంధాలను తెంచుకుంటామని ఉత్తర కొరియా మంగళవారం వెల్లడించింది. తమ శత్రుదేశంతో ఇక ఎంతమాత్రం సంబంధాలు ఉండవని ఆ దేశ మీడియా తెలిపింది. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా దక్షిణ కొరియా సరిహద్దుల్లో కరపత్రాలు పంచుతున్న కార్యకర్తల పై బెదిరింపుల తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌-జే-ఇన్‌ మధ్య 2018లో మూడు సార్లు చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ఈక్రమంలో దక్షిణ కొరియాలో నివసిస్తున్న కొంతమంది నిరసనకారులు, ఉత్తర కొరియా నుంచి వలస వచ్చిన వారు.. కిమ్‌ నియంతృత్వ పోకడలు, అణ్వాయుధాలపై ఉత్తర కొరియా విధానాలను విమర్శిస్తూ.. సరిహద్దుల్లో బెలూన్లు ఎగురవేశారు. దాంతోపాటు కిమ్‌ను దుయ్యబడుతూ రాయించిన కరపత్రాలను గాల్లోకి విసిరారు. దీంతో ఉత్తర కొరియా తీవ్రంగా స్పందించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన మిలిటరీ ఒప్పందం నుంచి తప్పుకొంటామని ఇప్పటికే హెచ్చరించింది. అంతేకాకుండా ఉభయ కొరియాల పునర్‌ కలయికకు నిదర్శనంగా నిలిచిన అనుసంధాన వేదికలన్నింటినీ మూసివేస్తామని చెప్పింది

అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ కీలక పాత్ర పోషించిందని అంటున్నారు. దక్షిణ కొరియా నుంచి ఇకపై ఎలాంటి గాలిబుడగల కరపత్రాలు తమదేశంలోకి రావడానికి వీలు లేదని తెగేసి చెప్పింది ఉత్తర కొరియా. దీంతో రెండు దేశాల మధ్య మరోమారు ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగిన సమయంలో ఉత్తర కొరియాకు చెందిన కొందరు దక్షిణ కొరియాలో చిక్కుకుపోయారు. అలా అక్కడ చిక్కుకున్న వ్యక్తులు ఉత్తర కొరియాలో ఉన్న బంధువులకు గాలి బుడగలు రూపంలో మెసేజ్ లు పంపుకుంటూ ఉంటారు. ఇది ఆనవాయితీగా వస్తోంది.