Begin typing your search above and press return to search.

పాము కాటుతో చంపేయడం ట్రెండ్ గా మారింది : సుప్రీం

By:  Tupaki Desk   |   7 Oct 2021 6:02 PM IST
పాము కాటుతో చంపేయడం ట్రెండ్ గా మారింది : సుప్రీం
X
విషసర్పం అయిన పాము కాటుతో ఓ మ‌హిళ‌ను చంపించిన కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు ఇవాళ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, జ‌స్టిస్ సూర్య కాంత్‌, జ‌స్టిస్ హిమా కోహ్లీల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారించింది. రాజ‌స్థాన్‌లోని జున్‌జునూ జిల్లాకు చెందిన ఓ కేసులో జ‌స్టిస్ సూర్య కాంత్ తీర్పునిస్తూ.. పాములు ప‌ట్టేవారి ద‌గ్గర నుంచి విష‌పూరిత స‌ర్పాల‌ను తీసుకువ‌చ్చి, ఆ పాము కాటుతో హ‌త్య చేయ‌డం ఓ కొత్త ట్రెండ్‌గా మారింద‌ని అన్నారు.

రాజ‌స్థాన్‌ లో ఇది మ‌రీ కామ‌న్‌ గా మారిపోయిన‌ట్లు జ‌స్టిస్ కాంత్ త‌న తీర్పులో తెలిపారు. 2019లో ఓ మ‌హిళ‌ను ఆమె కోడ‌లు చంపించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌రో వ్య‌క్తితో అక్ర‌మ సంబంధం పెట్టుకున్న కోడ‌లు అల్ప‌నా, త‌న ప్రియుడు మ‌నీశ్‌తో క‌లిసి అత్త సుబోదా దేవిని పాటు కాటుతో మ‌ర్డ‌ర్ చేయించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఉద్యోగ‌రీత్యా సుబోదా దేవి కుమారుడు స‌చిన్ మ‌రో చోట ప‌నిచేస్తున్నారు. స‌చిన్‌, అల్ప‌నా మ‌ధ్య‌ 2018లో వివాహం జ‌రిగింది. కానీ అల్ప‌నా జైపూర్‌కు చెందిన మ‌నీశ్‌ తో వివాహేత‌ర సంబంధం కొన‌సాగించింది. ఇది అత్త సుబోధ‌కు తెలిసింది. ఆమె చీవాట్లు పెట్ట‌డంతో అల్ప‌న త‌న ప్రియుడితో క‌లిసి విష‌స‌ర్పం చేత సుబోధ‌ను చంపించింది.

ఈ కేసులో స్నేహితుడు కృష్ణ కుమార్ అనే వ్య‌క్తి కూడా నిందితుడిగా ఉన్నాడు. అత‌ను పాములు ప‌ట్టేవారి నుంచి ఓ పామును తెచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. సుబోధా దేవి మ‌రణించిన రోజున అల్ప‌నా 124 సార్లు మ‌నీశ్‌కు ఫోన్ చేయ‌గా, 19 సార్లు కృష్ణ కుమార్‌కు కూడా ఫోన్ చేసింది. అయితే బుధ‌వారం కోర్టులో కృష్ణ కుమార్ త‌ర‌పున ఓ న్యాయ‌వాది వాదిస్తున్న స‌మ‌యంలో జ‌స్టిస్ సూర్య కాంత్ స్పందిస్తూ, పాముల‌తో మ‌ర్డ‌ర్ చేయించ‌డం ఓ ట్రెండ్‌గా మారిన‌ట్లు తెలిపారు. ఈ కేసులో అల్ప‌నా, మ‌నీశ్‌, కృష్ణ‌కుమార్‌ ల‌ను 2020 జ‌న‌వ‌రి 4న అరెస్టు చేశారు. అప్ప‌టి నుంచి వాళ్లు జైలులోనే ఉన్నారు.