Begin typing your search above and press return to search.

డబ్బు కోసం రెండో పెళ్లాన్ని చంపాడు.. మొదటి భార్య హత్య బయటకొచ్చింది

By:  Tupaki Desk   |   25 May 2021 6:00 PM IST
డబ్బు కోసం రెండో పెళ్లాన్ని చంపాడు.. మొదటి భార్య హత్య బయటకొచ్చింది
X
వీడి గురించి తెలిస్తే.. వీడ్నేం చేసినా ఫర్లేదనిపిస్తుంది. విన్నంతనే వణుకు పుట్టించే ఈ ఉదంతం వింటే వీడు మనిషేనా? అన్న సందేహం రాక మానదు. వరంగల్ రూరల్ జిల్లా పర్వగతిరి మండలం ఏనుగల్లుకు చెందిన 36 ఏళ్ల కిరణ్ కు సంబంధించిన నేర చరిత్ర తాజాగా బయటకొచ్చింది. అతడి పాపం పండింది. ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కిరాతకంగా చంపేయటమే కాదు.. ఇంటి ఆవరణలోనే పూడ్చి పెట్టాడు.

ఇతడి టాలెంట్ ఎంతంటే.. మొదటి భార్యను చిత్రహింసలు పెట్టి చంపేసి.. ఆమెను ఇంటి ఆవరణలోనే పూడ్చి పెట్టి.. అమాయకుడి మాదిరి.. గొడవలతో విడాకులు ఇచ్చానని గ్రామస్తులందరిని నమ్మించాడు. 2019లో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి తర్వాత అతడిలో మార్పు రాలేదు సరి కదా.. అదనపు కట్నం కోసం హింసించేవాడు. తండ్రి ఇంటిని అమ్మి.. ఆ డబ్బులు తీసుకురావాలంటూ చిత్ర హింసలకు గురి చేసేవాడు. తరచూ కొట్టేవాడు.

ఈ క్రమంలో ఈ నెల 12న ఆమె అనుమానాస్పద రీతిలో మరణించింది. దీంతో.. రెండో భార్య తల్లిదండ్రులు కిరణ్ మీద కంప్లైంట్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపారు. వారి విచారణలో విస్మయకర విషయాలు బయటకు వచ్చాయి. రెండో భార్యను మాత్రమే కాదు.. మొదటి భార్యను కూడా చంపిన వైనాన్ని విచారణలో ఒప్పుకోవటంతో ఇప్పుడీ విషయం స్థానికంగా షాకింగ్ గా మారింది.