Begin typing your search above and press return to search.

ప్రియుడి కోసం భర్తను దారుణంగా చంపేసింది

By:  Tupaki Desk   |   24 Sept 2020 1:00 PM IST
ప్రియుడి కోసం భర్తను దారుణంగా చంపేసింది
X
కాలం మారింది. మానవ సంబంధాల్లో మార్పులు శర వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఎలాంటి తప్పు చేయకున్నా.. తమ మోజుల్ని తీర్చుకోవటం కోసం జీవితభాగస్వాముల్ని చంపేసే భార్యల ఉదంతాలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. తాజాగా వరంగల్ గ్రామీణ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఒక ఉదంతం గురించి తెలిస్తే.. నోట మాట రాదంతే.

రోజులు గడిచే కొద్దీ ఎటు పోతున్నామన్న విషయం అర్థం కానట్లుగా తాజా ఉదంతం ఉందని చెప్పాలి. హన్మొకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో హోం గార్డుగా పని చేస్తుంటాడు 32 ఏళ్ల దర్యావత్ సింగ్. మహబూబాబాద్ జిల్లాకు చెందిన జ్యోతితో ఆరేళ్ల క్రితం పెళ్లైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉండగా.. జ్యోతికి ఈ మధ్యన సాంబరాజు అనే యువకుడితో పరిచయమైంది.

తక్కువ కాలంలోనే అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో.. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇదిలా ఉండగా.. కరోనా కారణంగా దర్యావత్ సింగ్ ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో.. జ్యోతికి ప్రియుడ్ని కలవటానికి ఇబ్బందిగా మారింది. దీంతో.. తమకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు జ్యోతి దారుణమైన ప్లాన్ వేసింది.

ఈ నెల 14న మద్యం తాగి ఉన్న భర్తను చూసి.. అతడ్ని అడ్డు తొలగించుకోవటానికి ఇదే సరైన సమయంగా భావించి.. తన ప్రియుడికి ఫోన్ చేసి చెప్పింది.దీంతో అతడు ట్రాలీ ఆటో తీసుకొచ్చాడు. అనంతరం తాడుతో దర్యావత్ సింగ్ గొంతుకు ఉరివేసి చంపారు. అనంతరం డెడ్ బాడీని ఆటోలో తన పత్తి చేనుకు తీసుకెళ్లి.. అక్కడ పెట్రోల్ పోసి తగలబెట్టారు.

పక్కరోజు ఉదయం చూస్తే.. శవం సగమే కాలి ఉంది. దీంతో.. మరోసారి శవాన్ని పూర్తిగా కాల్చేశారు. బూడిదను తీసుకొని దగ్గర్లోని చెరువులో పారబోశారు. ఇదిలా ఉంటే.. తన సోదరుడు దర్యావత్ సింగ్ కనిపించకపోవటంతో అన్న వీరన్నకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు జ్యోతిని విచారించారు. ఆమె మాటలు అనుమానం రావటంతో.. ఆమె కాల్ డేటాను పరిశీలించారు. అనంతరం ప్రియుడ్ని అదుపులోకి తీసుకొని ఇరువురిని విచారించగా.. అసలు విషయం బయటకు వచ్చింది. తన భర్తను చంపినట్లుగా జ్యోతి ఒప్పుకుంది. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.