Begin typing your search above and press return to search.

60 గంట‌ల టెన్ష‌న్ తీరింది.. క్షేమంగా ఉన్న జ‌సిత్

By:  Tupaki Desk   |   25 July 2019 4:56 AM GMT
60 గంట‌ల టెన్ష‌న్ తీరింది.. క్షేమంగా ఉన్న జ‌సిత్
X
గ‌డిచిన 60 గంట‌లుగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. ప్ర‌తి ఒక్క‌రి వాట్సాప్ గ్రూపుల్లో క‌నీసం ప‌ది వ‌ర‌కూ పోస్టులు నాలుగేళ్ల చిన్నారి జ‌సిత్ కు సంబంధించిన పోస్టులు రావటం తెలిసిందే. నాయ‌న‌మ్మ‌పై దాడి చేసి పిల్లాడ్ని కిడ్నాప్ చేసిన వారి కోసం ఏపీకి చెందిన 500 మంది పోలీసులు వివిధ ప్రాంతాల్లో జ‌ల్లెడ ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.

చిన్నారికి ఏమీ కాకూడ‌ద‌ని.. క్షేమంగా తిరిగి రావాలంటూ కోట్లాది మంది ప్ర‌జ‌ల ఆశ‌లు.. ఆకాంక్ష‌లు తీరాయి. నాలుగు రోజుల టెన్ష‌న్ కు బ్రేక్ చెబుతూ.. కుతుకులూరు రోడ్డులో జ‌షిత్ ను కిడ్నాప‌ర్లు రోడ్డు మీద వ‌దిలి వెళ్లిపోయారు. ఆ పిల్లాడ్ని గుర్తించిన కూలీలు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌టంతో జ‌సిత్ కిడ్నాప్ క‌థ సుఖాంత‌మైంది.

తూర్పుగోదావ‌రి జిల్లా మండ‌పేట‌కు చెందిన నూక వెంక‌ట‌ర‌మ‌ణ‌.. నాగ‌వ‌ళి దంప‌తుల కుమారుడు జ‌సిత్‌. వీరిద్ద‌రి 2014లో పెళ్లి కాగా.. ఏడాదికే జ‌సిత్ పుట్టాడు. ఇద్ద‌రు బ్యాంకు ఉద్యోగులైన వీరి కొడుకును నాన‌మ్మ‌తో ఆడుకుంటుండ‌గా.. దాడి చేసి మ‌రీ కిడ్నాప్ చేశారు. పిల్లాడి ఆచూకీ కోసం పెద్ద ఎత్తున వెతుకులాట సాగింది. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు అలుపెర‌గ‌ని రీతిలో కృషి చేశారు.

అన‌ప‌ర్తి ఆసుప‌త్రి వ‌ద్ద పిల్లాడిని చూసిన‌ట్లు కొంద‌రు చెప్ప‌టం.. పోలీసులు త‌మ సోదాల్ని మ‌రింత ముమ్మ‌రం చేసిన క్ర‌మంలో గురువారం తెల్ల‌వారుజామున కుతుకులూరు చింతాల‌మ్మ గుడి వ‌ద్ద బాలుడ్ని కిడ్నాప‌ర్లు విడిచిపెట్టి వెళ్లిపోయారు. పోలీసుల ముమ్మ‌ర గాలింపు చ‌ర్య‌ల‌తో బెదిరిన కిడ్నాప‌ర్లు బాబును వ‌దిలేసి ఉంటార‌ని భావిస్తున్నారు. జ‌సిత్ క్షేమంగా బ‌య‌ప‌డ్డాడ‌న్న విష‌యంలో ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే.. నాలుగు రోజుల నుంచి ఆచూకీ తెలీకుండా ఉన్న జ‌సిత్ క్షేమంగా దొరికాడ‌న్న శుభ‌వార్త తెలుగు ప్ర‌జ‌ల‌కు అందింది. త‌మ పిల్లాడు క్షేమంగా దొర‌క‌టంపై త‌ల్లిదండ్రులే కాదు.. కోట్లాది మంది సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే కిడ్నాప‌ర్ల గురించి నాలుగేళ్ల జ‌సిత్ కొన్ని విష‌యాలు వెల్ల‌డించారు. నిన్న తాను తాత‌య్య ద‌గ్గ‌ర ఉన్నాన‌ని.. ఏదో ఊరి ద‌గ్గ‌ర ఉన్న‌ట్లు చెప్పాడు. అక్క‌డ వేరే వాళ్లెవ‌రో కిడ్నాప్ చేశాడ‌న్నారు. వాళ్ల‌ల్లో ఒక అబ్బాయి పేరు రాజు అని.. వాళ్ల అత్త వాళ్లింటికి వెళ్లిన‌ట్లు చెప్పారు. వాళ్లు రోజూ త‌న‌కు ఇడ్లీయే పెట్టార‌న్నారు. త‌ర్వాత త‌న‌ను తీసుకెళ‌తామ‌ని ఒక అబ్బాయి వాళ్లింట్లో వ‌దిలేశాడ‌ని.. రాజు అని చెప్పిన అబ్బాయే త‌న‌ను బైక్ మీద దింపేసిన‌ట్లు చెప్పాడు. ఒక చిన్న పిల్లాడు వ‌స్తున్నాడ‌ని తాను కొద్దిసేపు ఉన్న‌ట్లు చెప్పాడు. అక్క‌డి నుంచి కారులో వ‌చ్చేశాన‌ని.. వాళ్లు కూడా త‌న‌కు ఇడ్లీనే పెట్టార‌న్నారు. చిన్న‌పిల్లాడు కావ‌టంతో.. జ‌సిత్ చెబుతున్న వివ‌రాలు అస్ప‌ష్టంగా ఉన్నాయి.